Begin typing your search above and press return to search.

ఏడీఆర్ నివేదికలో చెప్పింది నిజమేనా ?

By:  Tupaki Desk   |   11 Sept 2021 9:54 AM IST
ఏడీఆర్ నివేదికలో చెప్పింది నిజమేనా ?
X
దేశవ్యాప్తంగా గడచిన ఏడేళ్ళల్లో అంటే 2014-21 మధ్యలో వివిధ పార్టీల మధ్య జరిగిన వలసలపై తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. జాతీయస్ధాయిలో కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయపార్టీల మధ్య జరిగిన వలసలు తదితరాలను వివరించింది. ఇందులో కొన్ని ప్రాంతీయపార్టీల వివరాలను కూడా ఇచ్చింది. ఈ వివరాల్లో తెలుగురాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు కూడా ఉన్నాయి. జాతీయ పార్టీల వివరాలు ఎంతవరకు నిజమని నిర్ధారించుకునే అవకాశం మనకు చాలా తక్కువే. ఎందుకంటే జాతీయపార్టీలంటేనే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల వివరాలుంటాయి.

అదే ప్రాంతీయపార్టీలంటే మాత్రం తెలుగు రాష్ట్రాల గురించే ప్రధానంగా దృష్టిసారిస్తాం. కాబట్టి చాలావరకు మనదగ్గర సమాచారం ఉంటుంది. మరి తాజాగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన ఏపి రాజకీయాలను చూస్తే నివేదికలోని వివరాలపై అనుమానాలు రావటం సహజం. ఈ నివేదిక మొత్తం కూడా ఒకపార్టీ నుండి మరోపార్టీలోకి వలసవెళ్ళిన అభ్యర్ధులు, ఎంపిలు/ఎంఎల్ఏలనే చెప్పారు. బహుశా ఏడీఆర్ ఉద్దేశ్యంలో అభ్యర్ధులంటే నేతలని అర్ధమేమో.

ఈ లెక్క చూసుకుంటే వైసీపీకి చెందిన ముగ్గురు అభ్యర్ధులు, 16 మంది ఎంపిలు, ఎంఎల్ఏలు పార్టీని వీడినట్లు చెప్పారు. ముందే చెప్పుకున్నట్లు ముగ్గురు నేతలెవరు వైసీపీని వీడి టీడీపీలో చేరలేదు. 2014-19 మధ్యలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎపిలు, 23 మంది ఎంఎల్ఏలు టీడీపీలో చేరారు. వీళ్ళు చేరారని చెప్పడంకన్నా చంద్రబాబునాయుడే వీళ్ళని లాక్కున్నారని చెప్పటం కరెక్టు. ఒక్కో ఎంపికి, ఒక్కో ఎంఎల్ఏకి ఒక్కోరమైన ప్రలోభానికి గురిచేసి టీడీపీలో చేర్చుకున్నారు.

ఇదే సందర్భంలో టీడీపీకి చెందిన 32 మంది అభ్యర్ధులు, 26 మంది ఎంపిలు, ఎంఎల్ఏలు పార్టీని వదిలేసినట్లు ఏడీఆర్ లో చెప్పారు. అలాగే ఇతర పార్టీలకు చెందిన 11 మంది అభ్యర్ధులు, ఎంపిలు, ఎంఎల్ఏలు 16 మంది టీడీపీలో చేరినట్లు చెప్పారు. మరీ ఈ లెక్క ఏమిటో అర్ధం కావటంలేదు. టీడీపీకి చెందిన 26 మంది ఎంపిలు, ఎంఎల్ఏలు ఏ పార్టీలోను చేరలేదు. కేవలం నలుగురు రాజ్యసభ ఎంపిలు మాత్రమే బీజేపీలోకి ఫిరాయించారు. టీడీపీ నుండి బీజేపీలో చేరిన వారిలో అత్యధికులు మాజీ ఎంపిలు, మాజీ ఎంఎల్ఏలే.

ఇక ఇతర పార్టీలకు చెందిన 36 మంది అభ్యర్ధులు, 24 మంది ఎంపిలు, ఎంఎల్ఏలు వైసీపీలో చేరినట్లు నివేదికలో చెప్పారు. ఇకూడా తప్పుగానే ఉంది. ఎందుకంటే ఇతరపార్టీల్లో నుండి 36 మంది అభ్యర్ధులు (నేతలు ) వైసీపీలో చేరలేదు. అలాగే ఇతర పార్టీల నుండి 24 మంది ఎంపిలు, ఎంఎల్ఏలు కూడా ఎవరు చేరలేదు. చంద్రబాబునాయుడుతో విభేదించిన నలుగురు ఎంఎల్ఏలు పార్టీకి దూరంగా ఉంటున్నారే కానీ ఒక్కళ్ళు కూడా వైసీపీలో చేరలేదు. మరి ఎవరు చేరకుండానే ఇతర పార్టీలకు చెందిన 24 మంది ఎంపిలు, ఎంఎల్ఏలు వైసీపీలో చేరినట్లు ఎలా చెప్పారో అర్ధం కావటంలేదు.

ఇదే సందర్భంగా జనసేనలోకి ఇతర పార్టీల నుండి నలుగురు అభ్యర్ధులు, ఇద్దరు ఎంపిలు, ఎంఎల్ఏలు చేరినట్లు రిపోర్టు చెబుతోంది. ఇదికూడా తప్పే. ఇతర పార్టీలకు చెందిన నేతలెవరైనా జనసేనలో చేరుండవచ్చు. అంతేకానీ ఇతర పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపి, ఎంఎల్ఏలు జనసేనలో చేరారని చెప్పటం తప్పే. జనసేన తరపున గెలిచిన ఒకే ఒక్క ఎంఎల్ఏనే ఇపుడు ఆ పార్టీలో ఉన్నారా ? అనే సందేహాలు వస్తున్నాయి. అలాంటిది ఇతర పార్టీల నుండి ఇద్దరు ఎంపి, ఎంఎల్ఏలు జనసేనలో చేరినట్లు ఏడీఆర్ చెప్పటం శుద్ధతప్పని తేలిపోయింది. ఏడీఆర్ లో ఇచ్చిన ఈ వివరాలన్నింటినీ ఏడీఆర్ నిర్వాహకులు ఎక్కడి నుండి సేకరించారో తెలీదు. మొత్తంమీద రిపోర్టులోని కొన్ని అంశాలు తప్పని అర్ధమైపోతోంది. దీని వల్ల మొత్తం రిపోర్టుపైనే అనుమానాలు కలుగుతున్నాయి.