Begin typing your search above and press return to search.

రాహుల్ కు ఈ సీట్లే చాలటండోయ్!

By:  Tupaki Desk   |   1 Jun 2019 3:48 PM IST
రాహుల్ కు ఈ సీట్లే చాలటండోయ్!
X
అసలే చాలా మంది కాంగ్రెస్ మీద సానుభూతితో ఉన్నారు. ఓడిపోయినందుకు కాదు కానీ, మరీ అంత చిత్తుగా ఓడిపోయినందుకు కాంగ్రెస్ మీద సానుభూతి ఉంది. కాంగ్రెస్ మీద ప్రేమ కాదు కానీ, కేంద్రంలో బలమైన ప్రతిపక్షం లేకుండా పోయిందని చాలా మంది అనుకుంటున్నారు. మోడీకి కొన్ని సందర్భాల్లో ముకుతాడు వేసే ప్రతిపక్ష పార్టీ ఉంటే బావుంటుందనేది అనేక మంది చెబుతున్న మాట.

కాంగ్రెస్ కు మరి కాస్త సీట్లు ఎక్కువగా ఉంచి ఉంటే మోడీకి బలమైన ప్రత్యర్థి ఉండే అవకాశం ఉండేదని వారు అంటున్నారు. అయితే ప్రజా తీర్పు అలా వచ్చింది. దానికి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి!

అయితే కాంగ్రెస్ రాజు రాహుల్ గాంధీ మాత్రం ఈ సీట్లే చాలని అనేస్తున్నారు! కాంగ్రెస్ పార్టీకి దక్కింది యాభై రెండు ఎంపీ సీట్లే అయినా రాహుల్ గాంధీ మాత్రం చాలు అంటున్నారు! తమ పార్టీకి దక్కిన సీట్లే చాలు అంటున్నారు. ఎందుకలా అంటే.. ఈ సీట్లతోనే రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీని గడగడలాడిస్తాడట!

బీజేపీని ఎగిరి దుంకించేందుకు ఈ మాత్రం సీట్లు చాలని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. తమ పార్టీ పార్లమెంటరీ మీటింగులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ని ఇరకాటంలో పెట్టేందుకు తమకు వచ్చిన ఎంపీల సంఖ్య చాలని రాహుల్ చెప్పుకొచ్చారు.

ఈ మాటలతో రాహుల్ గాంధీ తమ పార్టీ వారిలో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నాలు సాగించినట్టుగా ఉన్నాడు. మరి లోక్ సభలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో!