Begin typing your search above and press return to search.

ఐర్లాండ్ తల్లులకు ప్రాణభిక్ష పెడుతున్న భారతీయ మహిళ

By:  Tupaki Desk   |   27 May 2018 5:00 PM GMT
ఐర్లాండ్ తల్లులకు ప్రాణభిక్ష పెడుతున్న భారతీయ మహిళ
X
పరాయి దేశ చట్టానికి తాను సమిధైపోయినా ఎందరికో వెలుగవుతోంది ఆ భారతీయ మహిళ. ఐర్లాండ్‌ లోని అబార్షన్ నిషేధం చట్టాన్ని సవరించి తీరాల్సిందే అంటూ 66.4 శాతం మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పడం వెనుక ఆమె విషాదాంతం దాగుంది. అవును... 2012లో ఐర్లాండులో ప్రమాదకర పరిస్థితుల్లో కూడా అబార్షన్ కు అనుమతి దొరక్క భారత సంతతి మహిళ సవితా సవితా హలప్పనవార్ మరణించిన ఘటన అక్కడి ప్రజల్లో ఆలోచన రేకెత్తించింది. అదే ఇప్పడు సవరణకు దారి చూపుతోంది.

ఐర్లాండ్‌ లో ఉండే భారతీయ మహిళ సవితా హలప్పనవార్ 2012లో 17వారాల గర్భవతిగా ఉన్నప్పుడు తనకు గర్భస్రావం జరుగుతుందని గుర్తించడంతో అబార్షన్ చేసి పిండాన్ని తొలగించమని వైద్యుల్ని కోరారు. కానీ గర్భస్థ శిశువు గుండె కొట్టుకుంటోంది కాబట్టి అబార్షన్ చేయడం కుదరదని వైద్యులు చెప్పారు. దీంతో.. ఆమె గర్భస్రావం కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతూ చనిపోయారు. సవిత మరణంతో దేశవ్యాప్తంగా వైద్యులకు - రాజకీయ నేతలకు - అబార్షన్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. అబార్షన్ చట్టాల్లో మార్పులు చేయాలనే ఆందోళనలు ఊపందుకున్నాయి. దీంతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అబార్షన్ చేసేందుకు వీలుగా 2013లో చట్ట సవరణ చేశారు. తల్లి ప్రాణాలకు ముప్పు వచ్చిందని వైద్యులు భావించినపుడు అబార్షన్ చేసేందుకు అనుమతిస్తూ ఈ చట్ట సవరణ చేశారు. ఒకవేళ చట్ట విరుద్ధంగా అబార్షన్ చేస్తే దోషులకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించేలా మార్పులు చేశారు.

2015లో ఆర్థిక - సాంస్కృతిక - సామాజిక హక్కులపై ఐక్యరాజ్య సమితి కమిటీ అబార్షన్లపై మరో ప్రజాభిప్రాయ సేకరణకు సిఫార్సు చేసింది. అత్యాచారం వల్ల వచ్చిన గర్భం, గర్భిణికి ప్రమాదకరమైన సందర్భాలపై మరింత స్పష్టత కోరింది. ఈ సందర్భాల్లో గర్భ విచ్ఛిత్తిని నేరంగా పరిగణించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. 2017లో అబార్షన్‌ కి ఆంక్షలులేని అనుమతి ఇవ్వాలన్న సిఫార్సును పౌర సభ ఆమోదించింది. ఇందులో గర్భం వచ్చిన తొలి నాళ్లలో అబార్షన్ సిఫార్సుకు అనుగుణంగా 64 శాతం ఓట్లు వచ్చాయి. అయితే దీనిపైనా భిన్నవాదనలు వచ్చాయి. దీంతో చట్ట సవరణ అవసరమన్న అభిప్రాయం తెరపైకి వచ్చింది. 2018లో చట్ట సవరణకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని ఐర్లాండ్ ప్రభుత్వం పేర్కొంది. ఆ ప్రకారమే ప్రజాభిప్రాయ సేకరణ జరపగా 66.4 శాతం మంది సవరణకు అనుకూలంగా ఓట్లేశారు.

మొన్న శుక్రవారం జరిగిన రెఫరెండంలో అబార్షన్ నిషేధం ఉపసంహరించాలని కోరుతున్న వారికి భారీ విజయం దక్కింది. ప్రస్తుతం మహిళల ప్రాణాలు ప్రమాదంలో పడ్డప్పుడు మాత్రమే అబార్షన్ అనుమతిస్తున్నారు. అత్యాచారం, అసహజ సంబంధాలతో గర్భం రావడం, పిండం సహజంగా వృద్ధి చెందిన కేసుల్లో దీన్ని అనుతించడం లేదు. ఈ ఓటింగ్‌తో గర్భస్థ శిశువుకు కూడా తల్లిలాగే జీవించే హక్కు ఉంటుందని చెప్పే 8వ సవరణను ఇప్పుడు మార్చనున్నారు.

రెఫరెండం ఫలితాలపై స్పందించిన ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ ''దేశంలో గత 20 సంవత్సరాలుగా జరుగుతోన్న విప్లవం పరిసమాప్తం అయ్యింది. ఇకపై తమ ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్త తీసుకునే అవకాశం మహిళలకు ఉంటుంది. వారిని గౌరవించండి'' అన్నారు. నిషేధం ఎత్తివేయాలంటూ దేశంలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఐరిష్ ప్రధాని వరాద్కర్ కూడా ఓటు వేశారు.