Begin typing your search above and press return to search.

ఫ్లైట్‌ టిక్కెట్టుగా రైల్వే వెయిటింగ్‌ లిస్ట్‌ టిక్కెట్టు..!

By:  Tupaki Desk   |   10 Jun 2015 9:30 AM GMT
ఫ్లైట్‌ టిక్కెట్టుగా రైల్వే వెయిటింగ్‌ లిస్ట్‌ టిక్కెట్టు..!
X
ప్రభుత్వ రంగ సంస్థలు దూసుకుపోవటం కాస్త అరుదైన విషయమే. మిగిలిన ప్రభుత్వరంగ సంస్థల మాదిరిగా కాకుండా.. కాలంతో పాటు తనను తాను మార్చుకోవటంలో ఐఆర్‌సీటీసీ ఎప్పటికప్పుడు ముందుంటోంది. మిగిలిన వాటి మాదిరి జడత్వంతో కాకుండా సరికొత్తగా ఆలోచించటం ఐఆర్‌సీటీసీ విజయరహస్యంగా చెప్పొచ్చు. వ్యాపార అవకాశాల్ని అందిపుచ్చుకునే ఈ సంస్థ తాజాగా వినూత్నమైన విధానానికి శ్రీకారం చుట్టింది.

నిత్యం లక్షలాదిమంది ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే రైల్వేటిక్కెట్లలో వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండి కన్ఫర్మ్‌ కాకుండా ఉండటం తెలిసిందే. వెయిటింగ్‌ లిస్ట్‌లో టిక్కెట్‌ కన్ఫర్మ్‌ కాని వారంతా ఏదో విధంగా ప్రయాణాలు చేసే వారే. అలాంటివారికి ఫ్లైట్‌లో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను అమలు చేసి విజయవంతంగా దూసుకుపోతోంది.

ఈ సరికొత్త విధానంలో రైల్వే వెయిటింగ్‌లిస్ట్‌ టిక్కెట్టు బుక్‌ చేసుకునే వారు.. తమ టిక్కెట్టుకాని కన్ఫర్మ్‌ కాని పక్షంలో.. అదే రూట్‌లో ప్రయాణించే విమానసర్వీసులకు సంబంధించిన సమాచారాన్ని ఈ-మొయిల్‌ ద్వారా అందిస్తారు. ఇక్కడ ప్రయాణికులకు ప్రయోజనం కలిగించే అంశం ఏమిటంటే.. సాధారణ విమాన టిక్కెట్లతో పోలిస్తే.. ఐఆర్‌సీటీసీ ద్వారా అందించే టిక్కెట్‌ ధర విషయంలో 30 నుంచి 40శాతం తక్కువ ధరకు లభించే అవకాశం ఉండటం.

ఇప్పటికే గో ఎయిర్‌తో వంద టిక్కెట్లకు ఒప్పందం చేసుకున్న ఐఆర్‌సీటీసీ.. ఈ విధానం విజయవంతం కావటంతో ఇప్పుడు..స్పైస్‌ జెట్‌తోనూ ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధం అవుతుంది. ఐటీఆర్‌సీటీసీ.. విమానసంస్థలు కలిపి అందిస్తున్న ఈ ఆఫర్‌ బాగుంది కదూ.