Begin typing your search above and press return to search.

ఐసిస్‌ కు అంత జ‌రిగినా...అది మానుకోలేదు

By:  Tupaki Desk   |   20 Feb 2017 5:06 AM GMT
ఐసిస్‌ కు అంత జ‌రిగినా...అది మానుకోలేదు
X
ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదుల దూకుడు ఎలా ఉందో తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఆదాయ వనరులు తగ్గిపోతున్నప్పటికీ ఐఎస్ దాడులు మాత్రం కొనసాగుతున్నాయని ఓ అంతర్జాతీయ సంస్థ పరిశీలనలో తేలింది. 2014లో ఐఎస్ ఆదాయం 1.9 బిలియన్ డాలర్లుగా ఉంది. 2016లో 870 మిలియన్ డాలర్లకు పడిపోయింది. 2014లో ఐఎస్ ఆధీనంలో ఇరాక్ - సిరియాలోని కొన్ని ప్రాంతాలు ఉండేవి. దీంతో వీళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది. ఇరాక్ - సిరియాలలో ముడి చమురు నిల్వలు ఎక్కువగా ఉండటంతో వ్యాపారులను బెదిరించి మామూళ్లు వసూలు చేసేవారు. లూటీలకు పాల్పడేవారు. ఇలా పలు మార్గాల ద్వారా ఐఎస్ ఉగ్రవాదులు తమ ఆదాయవనరులను పెంచుకున్నారు. తర్వాతకాలంలో ఐఎస్ ఉగ్రవాదులను ఏరిపారేయడానికి ఇరాక్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది. వారి చేతుల్లో ఉన్న భూభాగంలో దాదాపు 62శాతం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

సిరియాలో 30 శాతం భూభాగాన్ని ఆధీనంలోకి తీసుకుంది. దీంతో ఉగ్రవాదులకు వసూళ్లు - లూటీలు చేసే అవకాశం లేకుండా పోయింది. క్రమంగా ఆదాయ వనరులు తగ్గిపోయాయి. అయితే ఐఎస్ దాడులు మాత్రం తగ్గలేదు. ఇటీవల జరిగిన పారిస్ - బ్రెసిల్స్ - బెర్లిన్ దాడులే ఇందుకు నిదర్శనం. ఉగ్రవాద సంస్థ నుంచి ఎలాంటి నిధులు సమకూరకపోయినా కొందరు ఉగ్రవాదులు సొంతంగా ఆయుధాలను సమకూర్చుకొని దాడులకు పాల్పడుతున్నారు. బాగ్దాద్‌ లో తరచుగా కారు బాంబు దాడులు - ఆత్మాహుతి దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. మ‌రోవైపు అమెరికా ప్రజలను ఉద్దేశించి చేసిన వారాంతపు రేడియో ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉగ్ర‌వాదుల‌పై క‌ఠిన వ్యాఖ్య‌లు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రతిఘటించాల్సిందేనని - ఉగ్రవాదులను ఓడించాల్సిందేనని పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యాలను తమ ప్రభుత్వం సాధించగలదన్న నమ్మకం తనకుందని ఆయన స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అందరికీ ముప్పే. కనుక దీనిని ప్రతిఘటించి ఉగ్రవాదులను ఓడించి తీరాలి’ అని ఆయ‌న తేల్చిచెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/