Begin typing your search above and press return to search.

ప్రచారమోజులో పడ్డ యువ ఐపీఎస్‌లు.!

By:  Tupaki Desk   |   3 March 2020 12:00 AM IST
ప్రచారమోజులో పడ్డ యువ ఐపీఎస్‌లు.!
X
ఐపీఎస్‌ ...ఆ పిలుపులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ ఉద్యోగం కోసం కొన్ని లక్షలమంది యువత ఏళ్ల తరబడి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పుస్తకాల పురుగుల్లా మారిపోతుంటారు. అయినా కూడా వారిలో ఎవరికో కానీ ఆ అవకాశం దక్కదు. ఇక అవకాశం వచ్చేది ఒక ఎత్తు అయితే , వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు. దీనితో తక్కువ కాలంలోనే ఉన్నత పదవులు చేపట్టాలనే ఆకాంక్షతో సోషల్ మీడియా ప్రచారం వైపు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు ఎక్కువగా ఉండటం ..సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు అధికంగా ఉండటంతో తమకు భవిష్యత్‌లో మంచి పోస్టింగ్‌లు వస్తాయో, రావో అనే సందేహం తో సోషల్ మీడియా లో వ్యక్తిగత ప్రచారం చేసుకొని , ప్రభుత్వ పెద్దల దృష్టిలో పడేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అయితే , ఇప్పటికే వారికీ వ్యక్తిగతంగా పీఆర్వోలు ఉన్నారు. వారి పేరున సోషల్‌ మీడియాలో అధికార ఖాతాలు ఉన్నాయి.

కానీ , ఇంకా తక్కువ కాలంలోనే ఎక్కువ పబ్లిసిటీ పొందాలనే ఆలోచన తో ఒక ప్రైవేట్‌ ఏజెన్సీ తో ఒప్పందాలు కుదర్చుకుంటున్నారు. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మాపై వచ్చే సోషల్ మీడియా లో వచ్చే వ్యతిరేక వార్తలకు కౌంటర్‌గా పాజిటివ్‌ వార్తలను సోషల్‌ మీడియాలో బాగా ప్రచారం చేయాలి. మిగతా అధికారుల కన్నా మా పేరు ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా చేయాలి అని ఏజెన్సీ నిర్వాహకులకు చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఆయనకు నచ్చేలా నచ్చేలా ట్వీట్లు చేయాలని కండిషన్ పెడుతున్నారు.

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌ స్టాగ్రామ్‌, తదితర తమ సోషల్‌ మీడియా ఖాతాలను ప్రమోట్‌ చేయడానికి.. ఒక్కో యువ ఐపీఎస్‌ అధికారి ఏడాదికి రూ.5 నుంచి 10 లక్షల వరకుచెల్లించుకుంటున్నారు. తెలంగాణలోని దాదాపు 10 మంది యువ ఐపీఎస్‌ అధికారులు ఇప్పటికే ఒక ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరి బాటలోనే మరికొంతమంది నడవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే , ఈ యువ ఐపీఎస్ ల నుండి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నిర్వాహకులు కూడా రేట్లు భారీగా పెంచేస్తున్నారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియా ఖాతాలను ప్రమోట్‌ చేసేందుకు నాలుగు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని , ఏ ప్యాకేజీ కావాలంటే దానికి తగ్గ రేటు చెపుత్నారు.తెలంగాణ రాష్ట్రం, రెండు తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది, దేశవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో పబ్లిసిటీ చేస్తామని, ఏది కావాలో ఎంచుకోవాలని అధికారులకి ఆఫర్‌ ఇస్తున్నారు.మొత్తంగా ఒక్కో ప్యాకేజీ కనిష్ఠంగా ఏడాదికి రూ.5లక్షల నుంచి గరిష్ఠంగా రూ.10లక్షల వరకు ఉంది

ఓ ఏజెన్సీ ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. పోలీసు ఉన్నతాధికారుల అధికారిక ట్విట్టర్‌ ఖాతాల్లో పోస్టింగ్‌లు చేయడం, కామెంట్లను పరిశీలించి తొలగించడం వంటివి చేస్తోంది. నెటిజన్ల ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారికి చేరవేస్తోంది. అయితే , మంచి పేరు అనేది ప్రజలకి సేవ చేస్తే ..మనం సొంత ప్రచారం చేసుకోకపోయినా వస్తుంది అని , ఇలా ఎటువంటి సేవ చేయకుండా ఊరికే వచ్చే పేరు వల్ల ఏ ఉపయోగం ఉండదు అని ఎస్పీలు వారికి స్పష్టం చేస్తున్నారు. సినీ స్టార్స్ అయితే తమ బ్రాండ్ ఇమేజ్ కోసం సోషల్ మీడియా లో ప్రచారం చేసుకుంటారు, కానీ ,ఐపీఎస్ అధికారుల కర్తవ్యం ప్రజలకి సేవ చేయడమే ...మన చేసే పనిలో నీతి , నిజాయితి ఉంటే మంచి పేరు దానికదే వస్తుంది అని , ఇలా డబ్బులు పెట్టి మరీ సొంత డబ్బా కొట్టించుకుంటున్న కొందరు ఐపీఎస్ ల వ్యవహారం ప్రభుత్వం దృష్టికి కూడా చేరింది అని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఏదైమైనా ...పోలీసులు అనేవారు ప్రచారం పై కాకుండా తమ విధి పై దృష్టి పెడితే ..వారికీ కావాల్సినంత ప్రచారం ..ప్రజలే చేసిపెడతారు.