Begin typing your search above and press return to search.

హిందూ దేవుళ్లపై ఐపీఎస్ అధికారి వివాదాస్పద ప్రతిజ్ఞ

By:  Tupaki Desk   |   16 March 2021 11:30 AM GMT
హిందూ దేవుళ్లపై ఐపీఎస్ అధికారి వివాదాస్పద  ప్రతిజ్ఞ
X
దీక్ష ఏదైనా మంచిది. కానీ.. ఒకరిపై విషం కక్కటం.. వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం.. మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరించటం తప్పు. ఎవరి మనోభావాలు వారివి. అంతమాత్రాన ఒకరి మనోభావాల్ని ప్రదర్శించుకోవటానికి ఒక సమూహానికి సంబంధించిన మనోభావాల్ని దెబ్బ తీసేలా వ్యవహరించటం తప్పే అవుతుంది. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్.. స్థానిక టీఆర్ఎస్ నేత పాల్గొనటం.. ప్రతిజ్ఞ చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం వడ్కాపూర్ లో దూళికట్ట బౌద్ధస్తూపం వద్ద భీమ్ దీక్షను చేపట్టారు. బుద్ధ వందనం పేరుతో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావటమే కాదు.. కొత్త రచ్చకు తెర తీసింది. ‘నాకు హిందూ దేవుళ్ల అవతారాలపై నమ్మకం లేదు. శ్రాద్ధకర్మలు పాటించను. పిండదానాలు చేయను. బుద్ధుడు ప్రవచించిన సూత్రాల్ని.. ప్రబోధాలను పాటిస్తాను’ అంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఇలా చేసిన వారిలో గురుకులాల విద్యాలయాల కార్యదర్శి కమ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్.. స్థానిక టీఆర్ఎస్ నేత నల్ల మనోహర్ రెడ్డి ఉన్నారు.

ఇక.. ఈ వివాదాస్పద ప్రతిజ్ఞ చేయించిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావటం గమనార్హం. ఈ వివాదాస్పద ప్రతిజ్ఞ గురించి తెలుసుకున్న వడ్కాపూర్ ఉప సర్పంచ్ అడువాల తిరుపతితో పాటు.. స్థానికులు పలువురు వచ్చి ఈ కార్యక్రమాన్ని తప్పు పట్టారు. హిందూ దేవుళ్లను అవమానిస్తున్నారంటూ ఆందోళన చేశారు. దీంతో.. ఈ వ్యవహారం పెద్దది కావటంతో పాటు.. వివాదాస్పదమైందన్న విషయాన్ని గుర్తించారేమో కానీ.. ప్రతిజ్ఞ చేయించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శంకర్ క్షమాపణలు చెప్పారు. అదే సమయంలో.. ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తాను నిర్వహించే స్వేరోస్ సంస్థకు.. ప్రతిజ్ఞకు ఏ మాత్రం సంబంధం లేదని.. తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదన్నారు. మరి.. కాదన్నప్పుడు అలాంటి ప్రతిజ్ఞ ఎందుకు చేసినట్లు? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.