Begin typing your search above and press return to search.

మళ్ళీ డ్యూటీలోకి ఏబీ...ఎవరి కళ్లలో ఆనందం కోసం..?

By:  Tupaki Desk   |   22 April 2022 11:36 AM GMT
మళ్ళీ డ్యూటీలోకి ఏబీ...ఎవరి కళ్లలో ఆనందం కోసం..?
X
ఆయన ఉన్నతస్థానంలో ఉన్న పోలీస్ అధికారి. గత ప్రభుత్వ హయాంలో ఆయన ఏదో చేశారు అన్న కారణంతో ప్రస్తుత ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది. అలా ఒక ఏడాది కాదు రెండేళ్ళుగా సస్పెన్షన్ లోనే ఉంచింది. దాంతో సుప్రీం కోర్టుని ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట కలిగింది. ఆయన మీద ఉన్న సస్పెన్షన్ వేటుని న్యాయం స్థానం రద్దు చేసింది.

వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో హై కోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకోబోమని పేర్కొంది. ఇదిలా ఉంటే ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా నిఘా పరికరాలు కొనుగోలు చేసి గూఢచర్యం చేశారన్న ఆరోపణల కారణంగా జగన్ ప్రభుత్వం ఆయన మీద రెండేళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేసింది.

ఇక రెండేళ్ళు గడచినా సస్పెన్షన్ మాత్రం అలాగే కొనసాగుతోంది. దీని మీద ఏబీ ప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకోలేదు. దాంతో సుప్రీం కోర్టుని ఆయన ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన భారీ ఊరటను పొందారు. అదే సమయంలో సస్పెన్షన్ వేటు రెండేళ్ళు పాటు ఉండడమేంటి అని సుప్రీం కోర్టు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపధ్యం కూడా ఉంది.

అంతేకాదు అల్ల్ ఇండియా సర్వీసెస్ లో ఉనన్ ఒక అధికారిని అన్నేళ్ల పాటు సస్పెషన్ లో ఉంచతగదని, అది చట్ట విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే తనకు అనుకూలంగా తీర్పు రావడం పట్ల ఏబీ వెంకటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఏ శాడిస్టు సైకో ఆనందం కోసం ఇదంతా చేశారు అంటూ చాలా గట్టిగానే ఏపీ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఉన్నతాధికారుల మీద ఆయన మండిపడ్డారు. గత రెండేళ్ళుగా తనను, తన కుటుంబాన్ని కూడా క్షోభ పెట్టారని ఆయన నిందించారు. కొందరు అధికారులు తప్పుడు కేసులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు అని ఆయన విమర్శించారు.

ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఓడిపోయిందని, దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారో చెప్పాలని కూడా ఆయన కోరారు. తన సస్పెన్షన్ ని ప్రశ్నించడమే తాను చేసిన నేరమని ఆయన వాపోయారు. తన విషయంలో లాయర్ల కోసమే ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేసిందని సంచలన ప్రకటనను ఆయన చేశారు.

ఇక సుప్రీం కోర్టులో లాయర్ల టీమ్ నే ఏర్పాటు చేశారని, వారికి ఎన్ని కోట్లు ఇచ్చి ఉంటారో తెలియదు అని ఆయన అంటున్నారు. ఇక ఈ కేసుల వల్ల తనకు కూడా పెద్ద మొత్తంలో ఖర్చు అయిందని, దాంతో తన ఫీజులను కూడా చెల్లించాలని ప్రభుత్వానికి లేఖ రాతానని ఏబీ చెబుతున్నారు.

ఇక తాను పక్కా లోకల్ అని తనను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ విడిచి పెట్టేది లేనే లేదని ఏబీ అనడం కూడా సంచలన‌మే. మొత్తానికి మళ్లీ డ్యూటీ ఎక్కబోతున్న ఏబీ ఎలా వ్యవహరిస్తారు, ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది చూడాల్సిందే.