Begin typing your search above and press return to search.

ఇప్పటం ఇళ్ల కూల్చివేత.. అసలు కథ ఏంటంటే?

By:  Tupaki Desk   |   8 Nov 2022 3:30 PM GMT
ఇప్పటం ఇళ్ల కూల్చివేత.. అసలు కథ ఏంటంటే?
X
ఇప్పటం.. ఇటీవల ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపి, చర్చనీయాంశంగా మారిన పేరు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సమీపంలోని మంగళగిరి నియోజకవర్గంలోని చిన్న ఊరు ఇది. ఈ గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో దాదాపు 50 ఇళ్ల దాకా ప్రభుత్వం కూల్చేయడం దుమారం రేపింది.

జనసేన పార్టీ ప్లీనరీకి పొలాలు ఇచ్చారన్న అక్కసుతో ఆ పార్టీ మద్దతుదారుల ఇళ్లను కావాలనే కూల్చి వేశారనే ఆరోపణలను ఆ పార్టీ నేతలు ఆరోపించారు. గ్రామస్థుల్లో కూడా చాలామంది ఇవే ఆరోపణలు చేశారు. కానీ ఇదంతా ప్రభుత్వం మీద దుష్ప్రచారం మాత్రమే అని.. గ్రామంలో అభివృద్ధి చేపడుతుంటే ఇలా అడ్డు పడుతున్నారేంటని అధికార పార్టీ వర్గాలు ఎదురు దాడి చేశాయి.

ఐతే తాజాగా ఇప్పటం గ్రామస్తుడు ఒకరు గ్రామంలో అసలేం జరిగింది.. జరగబోతోంది అంటూ ఒక వీడియో చేశాడు. అయ్యప్పస్వామి మాల వేసుకున్న ఆ వ్యక్తి ఇప్పటంలో వాస్తవంగా ఏం జరిగిందో ఆధార సహితంగా వివరించే ప్రయత్నం చేశాడు. ఇప్పటం గ్రామానికి హైవే నుంచి 2 కిలోమీటర్లు కాగా.. అక్కడి నుంచే ఈ వీడియో మొదలైంది.

హైవే పక్కన లింక్ రోడ్డును చూపిస్తూ.. ఇంత చిన్నగా ఉండి, గతుకులు పడ్డ ఈ రోడ్డును విస్తరించకుండా, అభివృద్ధి చేయకుండా గ్రామం లోపల 120-140 అడుగులకు రోడ్డును విస్తరించడంలో ఔచిత్యం ఏంటని అతను ప్రశ్నించాడు. మధ్యలో బాగా దెబ్బ తిని కూలిపోయే స్థితిలో ఉన్న కల్వర్టును చూపించి దీన్ని బాగు చేయరా.. ఒక్క బస్సును మించి ప్రయాణించడానికి వీల్లేకుండా ఉన్న ఈ కల్వర్టు పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు.

అలాగే ఇంకొంచెం ముందు రైల్వే సిగ్నల్ ఉందని.. దీని మీద ఫ్లై ఓవర్ వేయకుండా ఊరి లోపల ఎంత అభివృద్ధి చేసినా వేస్ట్ అని అభిప్రాయపడ్డాడు. ఇక ఊరి లోపల కరెంటు స్తంభాల అవతల ఉన్న ఇళ్లను కూల్చేయడం.. వైఎస్ విగ్రహాన్ని మాత్రం కంచెలు వేసి అలాగే వదిలిపెట్టడం.. మధ్య మధ్యలో రోడ్డుకు అడ్డంగా ఉన్న గుళ్ల గురించి ప్రస్తావించడం ఈ వీడియోలో చూడొచ్చు.

అతను చెబుతున్న దాని ప్రకారం జనసేన ప్లీనరీకి పొలాలు ఇచ్చారన్న అక్కసుతో కేవలం కక్ష సాధింపులో భాగంగా ఇళ్లు కూల్చేశారు తప్ప.. మిగతా రోడ్డు గురించి అసలు పట్టించుకోకుండా ఊరి లోపల రోడ్డు విస్తరణ అనడంలో లాజిక్కే లేదని చెప్పాడు. ఈ వీడియో చూసిన ఎవరికైనా అతను చెబుతున్నది వాస్తవమే అనిపించకమానదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.