Begin typing your search above and press return to search.

ఇవేం లైట్లు బాబోయ్..క్యాచ్ లు వదిలేస్తున్న ఆటగాళ్ళు

By:  Tupaki Desk   |   8 Oct 2020 9:00 AM IST
ఇవేం లైట్లు బాబోయ్..క్యాచ్ లు వదిలేస్తున్న ఆటగాళ్ళు
X
ఐపీఎల్లో ఆటంతా బాగుంది. బ్యాట్స్ మెన్లు బౌండరీల మోత మోగిస్తుండగా, బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు విసురుతూ ఆకట్టుకుంటున్నారు. అయితే సమస్య అంతా ఫీల్డింగ్ గురించే. చాలా మంది ఫీల్డర్లు క్యాచ్ లు నేలపాలు చేస్తున్నారు. చక్కగా ఫీల్డింగ్ చేసే జడేజా,విరాట్ కోహ్లి వంటి వారు కూడా బంతులు అందుకోలేక పోతున్నారు. దానికి కారణం వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదు. సమస్య అంతా స్టేడియంలో లైటింగ్ ఎఫెక్ట్ వల్లే. సాధారణంగా డే అండ్ నైట్ మ్యాచ్ లు నిర్వహించే స్టేడియంలలో స్టేడియానికి నాలుగు వైపులా భారీ పోల్స్ ఏర్పాటు చేసి వాటికీ ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తారు. అవి చాలా ఎత్తులో ఉండి మైదానమంతా వెళుతురును ప్రసరింప చేస్తాయి.


కానీ దుబాయ్‌ స్టేడియంలో ఈ విధంగా కాక, వలయాకారంలో ఉండే స్టేడియం పైకప్పు అంచుల్లో ఖాళీ లేకుండా వరుసగా లైట్లు బిగించేశారు. దీంతో లైటింగ్ సాధారణంగా కాకుండా కాస్త ఎక్కువగా ఉంది. బ్యాట్స్ మెన్ బలంగా బాదితే బాగా ఎత్తుకు వెళ్లిన బంతి కోసం ఫీల్డర్ తల ఎత్తితే లైట్‌ వెలుతురు కళ్లపై పడుతుండటంతో క్యాచ్‌లు అందుకోవడం కష్టమవుతోంది. దీంతో స్టేడియంలో ఫీల్డింగ్ చేయడం కష్టం అవుతోంది. ఏ వైపునకు చూసినా కాంతి కళ్ళలో పడుతోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి రాహుల్‌ క్యాచ్‌లు రెండు సార్లు వదిలేయడానికి కారణం ఈ లైట్లే. యజేంద్ర చాహల్‌కూడా ఇలాగే ఓ క్యాచ్‌ వదిలేశాడు. ఎత్తు నుంచి వస్తున్న బంతి ఏ దిశగా వస్తుందో అంచనా వేయడం కష్టంగా మారింది. స్టేడియంలో లైటింగ్ సమస్య గురించి దిల్లీ, చెన్నై కెప్టెన్లు శ్రేయాస్ అయ్యర్‌, ధోని ఇప్పటికే వెల్లడించారు. పలువురు ఆటగాళ్ళు సమస్యపై ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.