Begin typing your search above and press return to search.

బిట్ కాయిన్ షేర్ రిస్క్ నా?

By:  Tupaki Desk   |   3 Jan 2021 5:51 AM GMT
బిట్ కాయిన్ షేర్ రిస్క్ నా?
X
పాత ఒక వింత.. కొత్త ఒక వెర్రిలాగా ఉంటుంది. ఏదైనా కొత్తది వస్తే జనాలు దానివెంట పడి పరిగెడుతుంటారు. కానీ దానివల్ల ఎన్ని కొంపలు మునుగుతాయి. ? ఎందరి జీవితాలు అతలాకుతలం అవుతాయో ఊహించరు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దూసుకొచ్చిన డిజిటల్ కరెన్సీ వెంట జనం పరిగెడుతున్నారు. ఇటీవల కాలంలో అనూహ్యంగా.. అసాధారణంగా పెరిగిపోయిన ఈ వర్చువల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ, అనధికార కరెన్సీగా పేరుపొందిన డిజిటల్ కరెన్సీ ‘బిట్ కాయిన్’ మరోసారి బలం పుంజుకుంది.క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ విలువ ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. కొత్త ఏడాదిలో బిట్ కాయిన్ విలువ 32వేల డాలర్ల(రూ.23 లక్షలు) పైకి చేరుకొని కొత్త రికార్డు సృష్టించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద కరెన్సీగా అమెరికన్ డాలర్, యూరప్ ‘పౌండ్’ ఖ్యాతిగాంచాయి. డాలర్ కంటే కూడా పౌండ్ విలువ ఎక్కువ. అయితే అగ్రరాజ్యం అమెరికా కరెన్సీతోనే ప్రపంచదేశాలన్నీ కూడా క్రయవిక్రయాలు - లావాదేవీలు చేస్తుండడంతో డాలర్ కు డిమాండ్ ఉంటుంది. ఒక్క డాలర్ కు మన రూపాయి విలువ దాదాపు 75 రూపాయలకు అటూ ఇటూగా చేరువైంది. కానీ కొత్తగా పుట్టుకొచ్చిన ఆన్ లైన్ కరెన్సీ ఇప్పుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది.

గత డిసెంబర్ మొదట్లో బిట్ కాయిన్ విలువ 20వేల డాలర్లే ఉండేది. కానీ సీక్రెట్ కరెన్సీ అయిన దీన్ని కొనేందుకు ప్రజలు - వ్యాపారులు - పారిశ్రామికవేత్తలు తెగ ఆసక్తి చూపారు. దీంట్లో పెట్టుబడి పెట్టడం చాలా రిస్క్ అని.. జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గత క్రిస్మస్ రోజున బిట్ కాయిన్ విలువ 24661 డాలర్లు ఉండేది. కొన్ని గంటల్లోనే అది 25000 డాలర్లకు చేరింది. ఆ తర్వాత ఇప్పుడు కొత్త సంవత్సరంలో రికార్డు సృష్టిస్తూ 32వేలకు చేరువైంది. ఒక్క వారంలోనే బిట్ కాయిన్ విలువ 3.15శాతం పెరగడం అసాధారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిట్ కాయిన్‌ అనేది చాలా ప్రమాదకరమైన కరెన్సీగా నిపుణులు చెబుతున్నారు. ఇది మన రూపాయి లాగా బయట మనకు కనిపించే కాయిన్ కాదు. ఇదో వర్చువల్ కరెన్సీ. దీన్లో ట్రేడింగ్ అంతా డిజిటల్ రూపంలోనే జరుగుతుంది. దీంతో మోసాలు జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా బిట్ కాయిన్ ధర ఒకే రకంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లాగానే... ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కార్యకలాపాల ప్రభావం బిట్ కాయిన్ పైనా ఉంటుంది. ఫలితంగా కాయిన్ ధర పెరుగుదల, తగ్గుదల వంటివి ఉంటాయి. ఐతే... ఈ కరెన్సీ ఎలా కంట్రోల్ అవుతుందన్నది ఎవరికీ తెలియని ఒక మర్మ రహస్యం.

వర్చువల్ కరెన్సీ బిట్ కాయిన్‌కు ఎలాంటి పూచీ, హామీ ఉండదు. బిట్ కాయిన్ కొనేవాళ్లు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయమిది. ఇది వాస్తవంగా మనం వాడే కరెన్సీ కాదు కాబట్టి ప్ర‌పంచంలో ఉన్న ఏ దేశ చ‌ట్ట‌మూ, ప్ర‌భుత్వమూ ఈ బిట్ కాయిన్‌కు పూచీగా ఉండ‌దు. హామీ ఇవ్వ‌లేదు. సాధార‌ణంగా ఆయా దేశాల కరెన్సీలకు అక్కడి సెంట్రల్ బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలు పూచీగా ఉంటాయి. కానీ బిట్ కాయిన్ విషయానికొచ్చేసరికి ప్రభుత్వాలు బాధ్యత వహించవు.

బిట్ కాయిన్ లావాదేవీల స‌మాచారం మొత్తం కంప్యూట‌ర్ స‌ర్వ‌ర్ల‌లో ఉన్న‌ప్ప‌టికీ అది భ‌ద్రంగా ఉంటుంద‌ని చెప్ప‌లేం. హ్యాక‌ర్లు దాడి చేస్తే బిట్ కాయిన్ లావాదేవీలు ప్ర‌శార్థ‌క‌మే అవుతాయి. దీనికి తోడు ఈ కరెన్సీ అంతా వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ క‌నుక సాఫ్ట్‌వేర్ ప‌రంగా ఏదైనా స‌మ‌స్య వ‌స్తే అప్పుడు కూడా బిట్ కాయిన్ వినియోగ‌దారుల‌కు న‌ష్టం వాటిల్లుతుంది. దీంతో మొత్తం డబ్బులన్నీ కోల్పోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిట్‌ కాయిన్స్‌ పై మోజుతో ట్రేడింగ్‌ చేస్తున్న ఇన్వెస్టర్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం అప్పట్లో హెచ్చరించింది. బిట్‌కాయిన్‌ సహా వర్చువల్‌ కరెన్సీలో ట్రేడింగ్‌ చేసే వారు సొంతంగా రిస్క్‌ తీసుకోవాలని, దీనికి ఎలాంటి పూచీ ఉండదని స్పష్టం చేసింది. బిట్‌ కాయిన్‌ ధర కేవలం స్పెక్యులేషన్‌పైనే ఆధారపడి ఉంటుందని, ఫలితంగా వీటి ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని - బిట్ కాయిన్ ట్రేడింగ్‌ కు ఇన్వెస్టర్లే బాధ్యులని తేల్చి చెప్పింది.