Begin typing your search above and press return to search.

అలా పెళ్లి వద్దని పారిపోయి..ఇలా కలెక్టరై తిరిగొచ్చిన అమ్మాయి!

By:  Tupaki Desk   |   16 Sept 2020 9:15 AM IST
అలా పెళ్లి వద్దని పారిపోయి..ఇలా కలెక్టరై  తిరిగొచ్చిన  అమ్మాయి!
X
తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేస్తుండటంతో.. ఇంట్లో నుంచి పారిపోయిన ఓ అమ్మాయి ఐఏఎస్ చదివి కలెక్టర్​గా తిరిగొచ్చింది. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. ఉత్తరప్రదేశ్​కు చెందిన సంజువర్మ (28) తల్లి 2013 లో కన్నుమూశారు. అప్పటికే సంజూ గ్రాడ్యుయేషన్​ పూర్తిచేసింది. ఎప్పటికైనా ఐఏఎస్​ చదవాలన్నది ఆమె కల. కానీ తొందరగా పెళ్లిచేస్తే బాధ్యత తీరిపోతుందని భావించిన తండ్రి సంజూకు పెళ్లి సంబంధాలు చూశాడు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పోవడంతో సంజూ ఇంట్లో నుంచి పారి పోయింది. ట్యూషన్లు చెప్పుకుంటూ కొంతకాలం పాటు కాలం వెళ్లదీసింది. అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ సీటు సంపాధించింది. అక్కడే ఐఏఎస్​ పరీక్షల కోసం రాత్రింబవళ్లు శ్రమించింది. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఆమె మంచి ర్యాంక్​ సాధించి కలెక్టర్​గా ఎంపికైంది.

యూపీఎస్సీ పరీక్షల కోసం ఆమె దాదాపు ఏడేళ్ల పాటు కష్టపడింది. తాజాగా సంజూ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘నేను ఇంట్లోనుంచి పారిపోయినప్పడు అంతా నన్ను తిట్టారు. మా బంధువులు ఎవరూ చేరదీయలేదు. నా గురించి ఊర్లో రకరకాల పుకార్లు పుట్టించారు. చదువుకోవడం కోసం ఎంతో కష్టపడ్డా. చాలా ప్రైవేట్ ​కంపెనీల్లో పని చేశా. ట్యూషన్లు చెప్పా. కష్టపడి కాదు.. పట్టుదలతో ఇష్టపడి చదివి చివరకు లక్ష్యాన్ని ముద్దాడాను. నేను తల్లిదండ్రులకు ఒక్క విషయం విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను.

దయచేసి పిల్లలపై మీ సొంత ఆలోచనలు రుద్దకండి. వారికి ఇష్టం లేకున్నా బల వంతంగా ఒప్పించి.. ఎమోషనల్​ బ్లాక్​ మెయిల్ చేసి పెళ్లిల్లు చేయకండి. వారి ఇష్టాలు తెలుసుకొని మీరు నడుచుకుంటే వారు ఎన్నో ఉన్నతలక్ష్యాలను సాధిస్తారు. లేదంటే గుంపులో ఒకరిగా మిగిలి పోతారు. అందువల్ల తల్లిదండ్రులు ఆడ పిల్లలను సమానంగా గౌరవించండి’ అని చెప్పారు సంజు.