Begin typing your search above and press return to search.

కూటమిలో కుమ్ములాటల జోరు

By:  Tupaki Desk   |   26 Nov 2018 4:21 AM GMT
కూటమిలో కుమ్ములాటల జోరు
X
తెలంగాణ ముందస్తు ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ మహాకూటమిలో కుమ్ములాటలు మరింత జోరందుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ జన సమితికి చెందిన నాయకులు - కార్యకర్తలు మహాకూటమికి సహకరించవద్దంటూ ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పై వొత్తిడి తీసుకు వస్తున్నట్లు చెబుతున్నారు. పొత్తులో భాగంగా ఇస్తామన్న సీట్లు ఇవ్వకపోగా ఇచ్చిన స్ధానాల్లో కూడా స్నేహపూర్వక పోటీ ఏమిటంటూ వారు కోదండరామ్ ను ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడితో కలిసి పని చేయడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని అంటున్నట్లు సమాచారం. తెలంగాణ కోసం కొట్లాడే సమయంలో అనేక సార్లు తెలుగుదేశం పార్టీని - ఆ పార్టీ నాయకులు.... ముఖ్యంగా చంద్రబాబు నాయుడ్ని విమర్శించిన మనం ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయడమేమిటనే వాదన తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని - ఇది క్షేత్ర స్ధాయిలో తెలుస్తున్నదని - అయినా ప్రజలు మహాకూటమిని నమ్మకపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీయే అని తెలంగాణ జన సమితి నాయకులు - కార్యకర్తలు అంటున్నట్లు సమాచారం.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ధులు కూడా మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలు తమకు సహరించడం లేదని అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నట్లు చెబుతున్నారు. మహాకూటమిలో భాగంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించాలనే ధ్యేయంతో అందరూ కలిసినా తెలంగాణ జన సమితి - తెలుగుదేశం పార్టీల నుంచి మాత్రం ఆ మేరకు సహకారం లభించడం లేదని ఫిర్యాదు చేస్తున్నాట్లు చెబుతున్నారు. ముఖ్యంగా మహబూబ్‌ నగర్ - రంగారెడ్డి - ఖమ్మం - అదిలాబాద్ జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందంటున్నారు. ఇక్కడ పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ ద్వారాను - తమ మనుషులను పంపి నేరుగానూ ఫిర్యాదులు చేస్తున్నట్లు చెబుతున్నారు.తన దగ్గరకు వచ్చిన వారందరికి నచ్చ చెప్పి పంపడం ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు. ఇదే విషయమై ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో తన వేగుల ద్వారా సమాచారం సేకరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయా నియోజకవర్గాలపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ తోను - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలకు ఇక ఎన్నో రోజులు లేకపోవడంతో అభ్యర్ధుల్లో గెలుపు గుబులు రేపుతోందని మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలే అంటున్నాయి.