Begin typing your search above and press return to search.

మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ ... సుప్రీం కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   10 Sept 2020 6:00 PM IST
మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ ... సుప్రీం కీలక వ్యాఖ్యలు
X
మారటోరియం సమయంలో వడ్డీ మాఫీ అంశంపై విచారణను సుప్రీం కోర్టు సెప్టెంబర్ 28కి వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. రుణగ్రహీతల ఖాతాలను మరో రెండు నెలలపాటు నిరర్థక ఆస్తులుగా ప్రకటించొద్దని ఇటీవల సుప్రీం ఆదేశించిన విషయం తెలిసిందే. రుణగ్రహీతలపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని తెలిపింది. రుణాలపై కేంద్రం, ఆర్బీఐ నిర్ణయాలను కోర్టు ముందుంచాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. అన్ని రంగాల రుణాలు, రుణగ్రహీతల అంశాలపై కేంద్రం, ఆర్బీఐ చర్చించాలని ఆదేశించింది. చర్చల సారాంశంతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. అఫిడవిట్‌ దాఖలుకు సుప్రీంకోర్టు రెండు వారాల గడువిచ్చింది.

కరోనా నేపథ్యంలో రుణాలు, ఈఎంఐల చెల్లింపుపై రెండు విడతలుగా మూడు నెలల చొప్పున కేంద్రం మారటోరియం విధించింది. అయితే , మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీని మాఫీ చేయడమనేది ఆర్థిక సూత్రాలకు విరుద్ధమని కేంద్రం, ఆర్బీఐ తరఫున తుషార్‌ మెహతా ఇప్పటికే సుప్రీంకు స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ రూపొందించిన అఫిడవిట్ ‌ను ధర్మాసనానికి సమర్పించారు. మారటోరియం సమయంలో వాయిదాల మీద వడ్డీ విధించాలనేదే కేంద్రం యోచన అని ఆయన తెలిపారు.

బ్యాంకు రుణ వాయిదాలపై మారటోరియం విధించిన కాలానికి వడ్డీని మాఫీ చేసే అవకాశాలపై సుప్రీంకోర్టు జూన్‌లో ఆర్థిక శాఖ అభిప్రాయాన్ని కోరింది. మారటోరియం కాలానికి వడ్డీ మాఫీ లేదా వడ్డీపై వడ్డీ మాఫీ అనే రెండు అంశాలు తమ పరిశీలనకు వచ్చినట్లు తెలిపింది. ఒక పక్క మారటోరియం ప్రకటించి, వడ్డీ వసూలు చేయడం తీవ్రమైన విషయమని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.