Begin typing your search above and press return to search.

సైన్యంలో చేరేందుకు తెలుగు యువతలో ఆసక్తి పెరుగుతోందా ?

By:  Tupaki Desk   |   18 Jun 2022 7:30 AM GMT
సైన్యంలో చేరేందుకు తెలుగు యువతలో ఆసక్తి పెరుగుతోందా ?
X
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సైన్యంలో చేరడానికి తెలుగు యువతలో ఆసక్తి బాగా పెరుగుతున్నట్లే ఉంది. అగ్నిపథ్ పథకంలో నియామకాలకు వ్యతిరేకంగా శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం చూసిన తర్వాత ఇంతమంది యువత సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నదా అనే సందేహాలు పెరిగిపోయాయి. ఒక అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల నుండి సుమారు లక్షన్నర మంది రెండేళ్ల క్రితం జరిగిన ఆర్మీ పరీక్షల్లో పాల్గొన్నట్లు సమాచారం.

మామూలుగా అయితే సైన్యంలో చేరడానికి ఉత్తరాధి రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లోని యువతలో ఆసక్తి తక్కువనే చెప్పాలి. సైన్యంతో దక్షిణాది రాష్ట్రాలకు భావోద్వేగం తక్కువగానే ఉంటుంది. పాకిస్ధాన్, చైనా, బంగ్లాదేశ్ దేశాలతో ఉత్తరాధి రాష్ట్రాలు సరిహద్దులను పంచుకుంటాయి. అందుకనే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, గుజరాత్, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాలతో పాటు హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ ల్లోనే సైన్యంలో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.

అలాంటిది ఈమధ్యలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్మీలో చేరేందుకు ఆసక్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. సైనిక నియామకాల కోసం సైనిక ప్రధాన కార్యాలయం రాష్ట్రాల వారీగా రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహిస్తుంటుంది.

ఈ ర్యాలీల్లో ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో భారీగా యువత పాల్గొంటున్నారు. ఏడాదికి నాలుగు సార్లు నిర్వహించే ర్యాలీల్లో ప్రతిసారి కనీసం నాలుగువేల మందికి తక్కువ కాకుండా పాల్గొంటున్నారు.

ఆర్మీ నియామకాలకు పదవ తరగతి విద్యార్హత కాబట్టి ఎక్కువ మంది దృష్టి పెడుతున్నారు. సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపే యువతకు శిక్షణిచ్చేందుకు ట్రైనింగ్ సెంటర్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రతి అభ్యర్ధి నుండి ట్రైనింగ్ కేంద్రం రు. 2 లక్షలు వసూలు చేస్తున్నాయంటేనే యువతలో ఎంత ఆసక్తి ఉందో అర్ధమైపోతోంది.

ఒక అంచనా ప్రకారం 10 లక్షల మంది జనాభాకు తెలంగాణాలో 17 మంది, ఏపీలో 26 మంది ఆర్మీలోకి ఎంపికవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుండి 402 మంది, ఉత్తరాఖండ్ నుండి 271 మంది ఎంపికవుతున్నారు. మంచి వేతనాలు, క్రమశిక్ష కలిగిన జీవితం, మంచి ఆహారం, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్, అర్హతకు తగ్గట్లుగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ లాంటి కారణాలతో సైన్యంలో చేరేందుకు ఆసక్తి పెరిగిపోతోంది.