Begin typing your search above and press return to search.

ఇంటర్ మంటలు.. ఆరేదెలా..?

By:  Tupaki Desk   |   26 April 2019 5:30 PM GMT
ఇంటర్ మంటలు.. ఆరేదెలా..?
X
ఊహించని ఉత్పాతంలా రగులుకున్న ఇంటర్మీడియట్ చిచ్చు చిన్న సమస్య కాదు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మూడు లక్షల మందికి పైగా విద్యార్థుల సమస్య ఇది. అంటే మూడు లక్షల కుటుంబాలకు సంబంధించిన సమస్య! అది ఒకనాటిది కాదు.. అంతమంది విద్యార్ధుల భవిత్యవానికి సంబంధించినది! వారి కెరీర్ ఆసాంతం ఈ ఇంటర్మీడియట్ మంట వారిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇలా ఆలోచిస్తే ఈ సమస్య తీవ్రత ఏమిటో తెలుస్తుంది.

సహజంగానే ఇంటర్ లో తక్కువ మార్కులు వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో చాలా మంది విద్యార్థుల ఆత్మహత్యాయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంటర్ మార్కులను కుటుంబాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధోరణిలో అలాంటి పరిస్థితి వచ్చింది. అది వేరే కథ. ఈ సారి ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

బోర్డు చేసిన సాంకేతిక తప్పిదాలు, వ్యవహరించిన నిర్లక్ష్యంతో అనేక మంది పిల్లల జీవితాలు నాశనం అయ్యాయి. చనిపోయిన వారిది ఒక విషాదం. వారి కుటుంబాలకు చీకటిని మిగిల్చింది ఇంటర్ బోర్డు. అధికారుల తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందని స్పష్టం అవుతోంది. తాము పిల్లల భవితవ్యాన్ని నిర్దేశించబోతున్నామనే ఇంగిత జ్ఞానంతో అధికారులు పని చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు.

ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని మాట్లాడారు. అయితే అంతటితో సమస్య పరిష్కారం అయిపోలేదని మేధావులు, పరిస్థితులను గమనిస్తున్న వారు చెబుతున్నారు. సీఎం సమీక్ష తర్వాత ఈ అంశంలో విద్యార్థులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.

ఫెయిల్ అయిన విద్యార్థులకు రీ వ్యాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ కు ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే సమస్య ఫెయిల్ అయిన విద్యార్థులదే కాదు.. పాస్ అయిన విద్యార్థులు కూడా వ్యాల్యుయేషన్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ పిల్లల ఆవేదన అర్థం చేసుకోదగినదే. పాస్ అయిన విద్యార్థులు రీ వ్యాల్యుయేషన్ కు సంబంధించి ప్రభుత్వం మరింత స్పష్టంగా స్పందించాల్సి ఉంది.

ఇక ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు రాసుకునే విషయమై కూడా ప్రభుత్వం తీరు సరిగా లేదు. విద్యార్థులంతా ఇంప్రూవ్ మెంట్ రాసుకునేందుకు బోర్డు అవకాశం ఇవ్వడం లేదు. ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా ఆ విద్యార్థి ఇతర సబ్జెక్టులను ఇంప్రూవ్ మెంట్ రాసుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదు. వ్యాల్యుయేషన్ ప్రక్రియే డొల్లగా ఉన్నప్పుడు, అదే సరిగా లేనప్పుడు.. పాస్ అయిన విద్యార్థులు, ఫెయిల్ అయిన విద్యార్థులు అంటూ తేడా చూపడం ఏమిటని నిపుణులు అడుగుతున్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదు.

ఇప్పుడు పిల్లలు అడుగుతున్న ప్రశ్నలకు, వ్యక్తం చేస్తున్న ఆవేదనకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి, వారు కోరిన మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇక రెండో అంశం… భవిష్యత్తుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఏం చేయనున్నారో కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. ఇప్పటికీ గందరగోళం అయితే కొనసాగుతూ ఉంది కాబట్టి.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసి.. పూర్తి స్థాయి పరిష్కార మార్గాన్ని అన్వేషించే ప్రక్రియను చేపడితే మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. మరి దీనిపై కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి!