Begin typing your search above and press return to search.

నారాయ‌ణ పావ‌ని మ‌ర‌ణం.. అంతు చిక్క‌ట్లేదే?

By:  Tupaki Desk   |   7 Oct 2017 10:50 AM GMT
నారాయ‌ణ పావ‌ని మ‌ర‌ణం.. అంతు చిక్క‌ట్లేదే?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప‌రిచిత‌మైన నారాయ‌ణ విద్యాసంస్థ‌ల్లో ప‌లువురు విద్యార్థులు మృతి చెంద‌టం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ సందుకో నారాయ‌ణ విద్యాసంస్థ‌లు ఉన్న నేప‌థ్యంలో.. అప్పుడ‌ప్ప‌డు మ‌ర‌ణాలు మామూలే అని కొంద‌రు కొట్టిపారేస్తుంటారు. అయితే.. రెండు రాష్ట్రాల్లో ఇన్ని విద్యాసంస్థ‌లు ఉండ‌గా.. ఎందులోనూ చోటు చేసుకొని మ‌ర‌ణాలు నారాయ‌ణ క‌ళాశాల‌ల్లో ఎందుకు చోటు చేసుకుంటాయ‌న్న సందేహాన్ని కొంద‌రు వ్య‌క్తం చేస్తుంటారు.

ఈ వాద‌న‌ను ప‌క్క‌న పెడితే.. తాజాగా క‌డ‌ప జిల్లాలోని నారాయ‌ణ కాలేజీలో ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దివే విద్యార్థిని పావ‌ని మ‌రణం క‌లిచి వేస్తోంది. 16 ఏళ్ల పావ‌న‌ని.. ద‌స‌రా సెల‌వుల‌కు వెళ్లి వ‌చ్చిన రోజుల వ్య‌వ‌ధిలోనే మ‌ర‌ణించ‌టం ఇప్ప‌డు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

పావ‌నిది ఆత్మ‌హ‌త్య‌గా క‌ళాశాల వ‌ర్గాలు చెబుతుంటే.. కాదంటే కాదంటూ పావ‌ని త‌ల్లిదండ్రులు వాదిస్తున్నారు. ద‌స‌రా సెల‌వులు పూర్తి అయ్యాక త‌న చేతుల‌తోనే తాను త‌న కూతుర్ని కాలేజీలో వ‌దిలిపెట్టి వెళ్లాన‌ని.. ఈ రోజు విగ‌త‌జీవిగా మారిన త‌మ కుమార్తెను ఇంటికి తీసుకెళ్లాల్సి వ‌స్తుంద‌ని తాను క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌ని పావ‌ని తండ్రి వేద‌న చూప‌రుల్ని క‌లిచివేస్తోంది. నారాయ‌ణ విద్యాసంస్థ‌ల్లో మ‌ర‌ణించే వారంతా విద్యార్థినులే ఎందుకు అన్న ప్ర‌శ్న కొంద‌రి నోట నుంచి వ‌స్తోంది. దీనిపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పావ‌ని మ‌ర‌ణాన్ని అనుమానాస్ప‌ద మ‌ర‌ణంగా పోలీసులు న‌మోదు చేశారు. సీఆర్ పీసీ 174 కింద అనుమానాస్ప‌ద మృతిగా కేసు నమోదు చేసిన‌ట్లుగా పోలీసులు చెబుతున్నారు. త‌మ కుమార్తెది ముమ్మాటికి హ‌త్యేన‌ని పావ‌ని పేరెంట్స్ మ‌ల్లేశ్వ‌ర్ రెడ్డి.. శివ‌మ్మ‌లు చింత‌కొమ్మ‌దిన్నె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పావ‌ని అనుమానాస్ప‌ద మృతి మీద వినిపిస్తున్న వాద‌న‌లు ఇప్పుడు ప‌లు సందేహాల‌కు తావిచ్చేలా ఉన్నాయ‌ని చెప్పాలి.

ముందుగా నారాయ‌ణ విద్యాసంస్థ‌ల వాద‌న చూస్తే.. పావ‌ని త‌న హాస్ట‌ల్ గ‌దిలో ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌ధ్య‌రాత్రిలో బాత్రూం కోసం లేచిన విద్యార్థిని ఒక‌రు పావ‌ని ఉరి వేసుకొని ఉండ‌టం చూసి త‌మ‌కు చెప్పింద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. పావ‌ని ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికిది కాద‌ని ఆమె త‌ల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వారు కొన్ని సందేహాల్ని వ్య‌క్తం చేస్తున్నారు.

వారి సందేహాలు చూస్తే..

1. పావ‌ని కోసం గురువారం తాము 20 సార్లు ఫోన్ చేస్తే యాజ‌మాన్యం మాట్లాడించ‌లేదు.

2. హాస్ట‌ల్ లో పిల్ల‌లు పావ‌ని అర్థ‌రాత్రి 2.30 దాటిన త‌ర్వాత సూసైడ్ చేసుకున్న‌ట్లుగా తాము గుర్తించిన‌ట్లు చెబుతుంటే.. నారాయ‌ణ యాజ‌మాన్యం మాత్రం ఉద‌యం 5 గంట‌ల‌కు సూసైడ్ చేసుకున్న‌ట్లుగా చెప్ప‌టం.

3. హాస్ట‌ల్ రూంలోపావ‌నితో పాటు ప‌ది మంది విద్యార్థినులు ఉన్నార‌ని.. వారి మ‌ధ్య‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకునే ప్ర‌య‌త్నం సాధ్య‌మేనా?

4. ఆత్మ‌హ‌త్య చేసుకునే క్ర‌మంలో అలికిడికి అంత‌మంది విద్యార్థినుల్లో ఒక్క‌రికైనా మెలుకువ రాదా?

5. గతంలోనూ ఇదే రీతిలో ఇద్ద‌రు విద్యార్థినులు హాస్ట‌ల్ గ‌దిలో ఊరి వేసుకొని చ‌నిపోవ‌టంపైనా సందేహాలున్నాయి.