Begin typing your search above and press return to search.

అనంతపురం కలెక్టర్ గా ఇంటర్ విద్యార్థిని

By:  Tupaki Desk   |   11 Oct 2020 4:40 PM IST
అనంతపురం కలెక్టర్ గా ఇంటర్ విద్యార్థిని
X
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ వినూత్న ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బాలికలకు ఒకరోజు పదవీ బాధ్యతలను అప్పగించి బాలికలకు అరుదైన గౌరవాన్ని కల్పించారు.

‘బాలికే భవిష్యత్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాల్లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లుగా బాలికలు బాధ్యతలు చేపట్టారు.

అనంతపురం జిల్లా కలెక్టర్ గా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.శ్రావణి ఎంపికైంది. జిల్లా కలెక్టర్ గా ఆమె ఇవాళ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

చీరకట్టులో వచ్చిన శ్రావణి కలెక్టర్ కుర్చీలో కూర్చోగా.. పక్కనే అనంతపురం జిల్లా కలెక్టర్ చంద్రుడు చేతులు కట్టుకొని నవ్వుతూ కనిపించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ పదవిలో బాలిక ఉండనున్నారు.

అధికారిణులుగా బాధ్యతలు స్వీకరించిన వారు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయాలని కలెక్టర్ చంద్రుడు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తనిఖీలు నిర్వహిస్తామంటే అవకాశం కల్పించాలని ఆదేశించారు. కాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధిత బాలికకు రూ.25వేలు పరిహారం అందించే ఫైల్ పై శ్రావణి తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.