Begin typing your search above and press return to search.

కులాంత‌ర వివాహాల‌పై కేంద్ర మంత్రి షాక్‌!

By:  Tupaki Desk   |   10 July 2017 10:19 AM GMT
కులాంత‌ర వివాహాల‌పై కేంద్ర మంత్రి షాక్‌!
X
రిప‌బ్లిక‌న్ పార్టీ వ్య‌వ‌స్ధాప‌కుడు - కేంద్ర మంత్రి రాందాస్ అథ‌వాలే త‌న వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రాష్ట్ర ప్ర‌భుత్వాలు రూ.5లక్షల ఆర్థిక సహాయం అందించాల‌ని వ్యాఖ్యానించారు. ఈ వివాహాల‌ను ప్రోత్స‌హించ‌డం వ‌ల్ల స‌మాజంలో అస‌మాన‌త‌లు తొల‌గించ‌వ‌చ్చ‌న్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల‌న్నారు. దేశంలో దళితులపై నానాటికీ దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివారం గుర్గావ్‌ లో మీడియాతో ఆయ‌న మాట్లాడారు.

కొద్ది రోజులుగా దళితులపై దాడులు పెరుగుతున్న‌ నేపథ్యంలో ఆయ‌న స్పందించారు. ఈ దాడులు తగ్గించేందుకు కులాంతర వివాహాలే పరిష్కారమ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ అంశం గురించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తానని అన్నారు. దళితులపై దాడుల నివార‌ణ‌కు, కులాంతర వివాహాల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్‌లో రూ.25కోట్లు కేటాయించాలని కోరుతున్నానని చెప్పారు.

అలాగే, ఇంటర్‌ క్యాస్ట్‌ మేరేజ్‌ చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వాలు రూ.5లక్షల ఆర్థిక సహాయంతోపాటు ఆ ఇద్దరిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. అలా చేయ‌డం వ‌ల్ల కులాల మ‌ధ్య అంత‌రం త‌గ్గి పోతుంద‌న్నారు. బిహార్‌, రాజస్థాన్‌లో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం కులాంతర వివాహాలు చేసుకున్న వారికి కేంద్రం రూ.2.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.50 వేల నుంచి రెండు లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం....భార‌త క్రికెట్ టీమ్ లో ఎస్సీ, ఎస్టీ ఆట‌గాళ్ల‌కు 25 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని అథ‌వాలే.... బీసీసీఐని కోరిన సంగ‌తి తెలిసిందే. దాని వ‌ల్ల అంత‌ర్జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీల‌కు స‌మాన అవ‌కాశాలు దొరుకుతాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. దీని వ‌ల్ల ఎటువంటి హాని జ‌ర‌గ‌ద‌ని, టీమిండియా ప్ర‌ద‌ర్శ‌న మెరుగుప‌డుతుంద‌ని తెలిపారు.