Begin typing your search above and press return to search.

మంత్రి ఇంటికి నిప్పు.. `కోన‌సీమ క‌ల్లోలం` ఎవ‌రిది?.. ప్ర‌భుత్వ పాత్ర ఎంత‌?

By:  Tupaki Desk   |   24 May 2022 3:37 PM GMT
మంత్రి ఇంటికి నిప్పు.. `కోన‌సీమ క‌ల్లోలం` ఎవ‌రిది?.. ప్ర‌భుత్వ పాత్ర ఎంత‌?
X
ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని కోనసీమను కొత్త‌ జిల్లాగా ఏర్పాటు చేస్తూ.. వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం.. త‌ర్వాత‌.. తాజాగా అంబేడ్క‌ర్ పేరు మార్పు.. వంటివి రాజ‌కీయంగానే కాకుండా.. సెంటిమెంటు ప‌రంగానూ.. తీవ్ర క‌ల‌క‌లం రేపింది. తాజాగా దీనికి సంబందించి మంత్రి పినిపే విశ్వ‌రూప్‌(అమ‌లాపురం ఎమ్మెల్యే, క‌మ్ ఎస్సీ మంత్రి) ఇంటిని త‌గ‌ల‌బెట్ట‌డం.. కోన‌సీమ‌ను మంటెత్తించేలా చేయ‌డం వంటివి తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు త‌ప్పు ఎవ‌రిది? ఎందుకు ఇలా జ‌రిగింది? అనేది ఆస‌క్తిగా మారింది.

ఆదిలో జ‌రిగింది ఏంటి?

కొత్త‌గా ఏర్పాటు చేసిన 13 జిల్లాల్లో కోనసీమకూడా ఒక‌టి. అయితే.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రిలోని కోన‌సీమ ప్రాంతాన్ని విడ‌దీసి.. జిల్లాగా ఏర్పాటు చేశారు. అయితే.. దీనికి ప్ర‌బుత్వం మొద‌ట్లో.. కోన‌సీమ‌గానే ఉంచింది. అయితే.. జిల్లా పేరును అంబేడ్కర్ జిల్లాగా మార్చాలని డిమాండ్‌ చేస్తూ గోదావరి జిల్లా అమలాపురంలో చాలా కాలం నుంచి(జిల్లాల ఏర్పాటు నుంచి) ఉద్య‌మాలు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా ప్ర‌భుత్వం ముసాయిదా నోటిఫికేష‌న్ జారీ చేసిన ద‌గ్గ‌ర నుంచి కూడా దీనిపై డిమాండ్లు వ‌స్తున్నాయి.

అంబేడ్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిర‌స‌న‌ల‌కు వేలాదిగా ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన అంబేడ్కర్ అభిమానులు , జిల్లా మద్దతుదారులు అనేక రూపాల్లో పోరాటాలు చేశారు. అదేస‌మ‌యంలో మంత్రి పినిపే విశ్వ‌రూప్‌కు కూడానిర‌స‌న కారులు విన్న‌వించారు. రెండోసారి కేబినెట్‌కు ఎన్నికైన ఆయ‌న‌కు ఈ జిల్లాపై మ‌రిన్ని డిమాండ్లు వ‌చ్చాయి. అయితే.. మొద‌ట్లో ప‌ట్టించుకోని వైసీపీ స‌ర్కారు.. ఇటీవ‌ల కాలంలో ఎస్సీల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌డంతో .. వారిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఎట్ట‌కేల‌కు త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంది.

ఈ క్ర‌మంలోనే తాజాగా కోన‌సీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాగా మారుస్తూ.. నిర్ణ‌యించింది. అయితే.. త‌ర్వాత‌ జిల్లా పేరును మార్చొద్దంటూ.. మ‌రికొంద‌రు రోడ్డెక్కారు. దీంతో ఇప్పుడు ఏం చేయాల‌నేది స‌ర్కారుకు పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ని అంటున్నారు. అయితే.. ఇప్పుడు జ‌రుగుతున్న ఉద్య‌మం వెనుక‌.. ప్ర‌తిప‌క్ష‌, అధికార పార్టీ అస‌మ్మ‌తి నేత‌లు ఉన్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

కొన్నాళ్లుగా జ‌రిగింది ఇదే..

ఈ జిల్లా పేరు(కోన‌సీమ‌)ను మార్చొద్దని కొంద‌రు, మార్చాల‌ని కొంద‌రు ఆందోళ‌న‌కు దిగ‌డంతో ఇప్పుడు ఇది వివాదానికి దారితీసింది. వారం కింద‌ట‌ అమలాపురంలో కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లారు. ఓ యువకుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పక్కనున్న వాళ్లు నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది. జిల్లా పేరును మార్చుతూ..(అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాగా) ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

కోనసీమ జిల్లా' పేరును మార్చొద్దని కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అమలాపురంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి ఆందోళనకారులు అమలాపురం నల్ల వంతెన దగ్గరకు చేరుకున్నారు. అక్కడనుంచి భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వద్దకు తరలివెళ్లారు. కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ గేటు లోపలకు వెళ్లి ధర్నా నిర్వహించారు. ఆందోళనకారుల్లో ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా చుట్టుపక్కల వాళ్ళు నియంత్రించారు. పోలీసులు కలెక్టరేట్ లోపలికి వచ్చే వారిని నియంత్రించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కోనసీమ జిల్లా పేరును అలాగే ఉంచకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు.

ఇటీవ‌లే పేరు మార్పు

కోనసీమ జిల్లా పేరును డా.బీఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డా బీఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. దీనికోసం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పేరులో డా.బీఆర్‌.అంబేడ్కర్‌ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

స‌ర్కారుదే త‌ప్పా?!

ఔను.. కోన‌సీమ విష‌యంలో తాజాగా మంత్రి పినిపే, ఎమ్మెల్యే పొన్నాడ‌ల ఇళ్లు త‌గ‌ల‌బెట్ట‌డం.. పోలీసుల‌పై దాడులు చేయ‌డం.. ర‌ణ‌రంగంగా మార‌డం వంటి ఘ‌ట‌న‌ల‌ను ప‌రిశీలిస్తే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో స‌ర్కారు త‌ప్పులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆదిలోనే ఈ ఉద్య‌మాన్ని ఒక దారిలోకి తెచ్చి ఉంటే.. ఆదిలో ఇక్క‌డి ప్ర‌జ‌లు కోరుకున్న అంబేడ్క‌ర్ పేరును పెట్టి ఉంటే.. స‌మ‌స్య ఉండేది కాద‌ని.. అప్ప‌ట్లో ప‌ట్టించుకోకుండా.. ఇప్పుడు మార్చ‌డంపై తీవ్ర స్తాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మొత్తానికి కోన‌సీమ క‌ల్లోలం వెనుక స‌ర్కారు పాత్ర ఉంద‌ని అంటున్నారు.