Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆ ఫీలింగ్ లేకుండా చేస్తున్నాడ‌ట‌

By:  Tupaki Desk   |   15 March 2017 10:23 AM GMT
కేసీఆర్ ఆ ఫీలింగ్ లేకుండా చేస్తున్నాడ‌ట‌
X
కుల‌వృత్తుల‌కు పున‌ర్ వైభ‌వం పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రె పిల్ల‌ల పెంప‌కాన్ని ఇటీవ‌లి కాలంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌క‌టించింది. అయితే ఈ క్ర‌మంలో టెక్నాల‌జీతో ముందుకు పోతున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింంది. తాము కొనుగోలు చేసే గొర్రె పిల్లలకు ఇన్సూరెన్స్ - జియో ట్యాగింగ్ చేస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శాసనసభలో మంత్రి తలసాని మాట్లాడుతూ.. గొర్రెల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని కురుమ - యాదవులకు గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. 75 శాతం రాయితీతో గొర్రెల పంపిణీ జరుగుతుందన్నారు. 4 లక్షల కుటుంబాలకు 84 లక్షల గొర్రె పిల్లలు పంపిణీ చేస్తామన్నారు.

రాష్ర్టంలోని వాతావరణానికి అనుకూలమైన గొర్రె పిల్లలను కొనుగోలు చేస్తామని త‌ల‌సాని తెలిపారు. గొర్రెల పెంపకంతో యాదవులు - కురుమల జీవితాలు బాగుపడుతాయన్నారు. బడ్జెట్ సందర్భంగా గొల్లకురుమలకు గొర్రెలు పంపిణీ చేస్తామని ప్రకటించడంతో ఆ కులాలు హర్షం వ్యక్తం చేశాయన్నారు. 60 ఏళ్ల చరిత్రలో యాదవులు - కురుమలు ఇప్పుడున్నంత సంతోషంగా ఎప్పుడూ లేరని తెలిపారు. గత ప్రభుత్వాలు గొల్లకురుమల సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. పేద వర్గాలను ఆదుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. బడ్జెట్‌ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన బడ్జెట్‌ ను ప్రవేశపెట్టామన్నారు. అన్ని వర్గాలవారికి న్యాయం జరిగేలా బడ్జెట్ ఉందన్నారు. "వ్యవసాయం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ చేపట్టారు. వ్యవసాయదారుల కష్టాలు తీర్చారు. విద్య విషయంలో మధ్యాహ్నం బోజనం పెట్టిన తర్వాత విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఏ ప్రాంతంలో ఏం చేస్తే అభివృద్ధి జరుగుతుందో తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు పూర్తయి ఉంటే బంగారు తెలంగాణ తొందరగా సాధ్యమయ్యేది. ఇప్పటికైనా ఇబ్బందిలేదు సీఎం కేసీఆర్ దార్శనికతతో బంగారు తెలంగాణను తొందరగా సాధించుకుందాం" అని అన్నారు. బడ్జెట్‌ లో కుల వృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, ఈ కేటాయింపులపై గ్రామాల్లో సంబురాలు చేసుకుంటున్నారని ప్ర‌శంసించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/