Begin typing your search above and press return to search.

ఇన్స్యూరెన్సు కంపెనీల ఏరియల్ సర్వే..

By:  Tupaki Desk   |   17 April 2016 9:25 AM GMT
ఇన్స్యూరెన్సు కంపెనీల ఏరియల్ సర్వే..
X
పంటల బీమాను పెద్దఎత్తున రైతుల్లోకి తీసుకెళ్లాలని నరేంద్ర మోదీ సర్కారు భావిస్తున్న వేళ, ప్రైవేటు రంగంలోని బీమా కంపెనీలు డ్రోన్లను వాడాలని ప్లాన్ చేస్తున్నాయి. పంట దిగుబడి ఎంత వస్తుందన్న విషయమై అంచనా వేసేందుకు డ్రోన్లను ఉపయోగించి వీడియోలు తీసుకునేందుకు అనుమతించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖను కోరుతోంది. మానవరహిత విమానాలను బీమా కంపెనీలు పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే, వాడుతుండగా అధునాతన సాంకేతికను మరింతగా వినియోగంలోకి తెస్తే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరింత విజయవంతమవుతుందని భావిస్తున్నారు.

ఇండియాలో వాణిజ్య పరమైన ఉపయోగాల నిమిత్తం డ్రోన్ల వాడకం చాలా తక్కువ. ముంబయిలో పిజ్జా డెలివరీ కోసం ఓ సంస్థ దీన్ని ప్రవేశపెట్టినా అది కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. డ్రోన్ల వినియోగంపై ప్రభుత్వాల ఆంక్షలున్నాయి. ఈ నేపథ్యంలో బీమా కంపెనీలు డ్రోన్లను వాడాలని భావిస్తున్నప్పటికీ, నిబంధనలు అడ్డుగా నిలుస్తున్నాయి. పంట ఎంత వస్తుందో తెలిస్తేనే, నష్టం జరిగిన సమయంలో రైతులు బీమా ఎంత చెల్లించాలన్నది స్పష్టమవుతుందన్నది కంపెనీల వాదన. ఈ సంవత్సరం పంటల బీమా నిమిత్తం రూ. 5,500 కోట్లు ఖర్చు పెట్టాలని మోదీ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. నామమాత్రపు ప్రీమియంతోనే పంటల బీమాను దగ్గర చేస్తామని బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. ఇక డ్రోన్ల వాడకానికి కూడా అనుమతి లభిస్తే, రైతులకే ప్రయోజనమని నిపుణులు అంటున్నారు. రాజస్థాన్ లో ఇలా డ్రోన్ల తో పంట పొలాల్లో ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించారట. సో... ప్రభుత్వం అనుమతి ఇస్తే ఇక పొలాలపై డ్రోన్లు చక్కర్లు కొడతాయన్నమాట.