Begin typing your search above and press return to search.

బీమా కంపెనీలకు దోమ భయం

By:  Tupaki Desk   |   2 Jan 2017 6:41 AM GMT
బీమా కంపెనీలకు దోమ భయం
X
దోమ చిన్న ప్రాణే కానీ అది కలిగించే నష్టం అంతాఇంతా కాదు. ప్రపంచంలో సగం రోగాలకు అదే కారణం. మలేరియా - డెంగీ - ఫైలేరియా... ఒకటేమిటి... ఎన్నో రకాల జ్వరాలు - ఇతర వ్యాధులు రావడానికి దోమ కాటే కారణం. మనుషుల ప్రాణాలు తీసే దోమ ఇప్పుడు ఇండియాలో ఇన్సూరెన్సు సంస్థలకు సవాల్ విసరబోతోంది. దోమకాటు వల్ల జబ్బు వచ్చి ఎవరైనా చనిపోతే వారికి బీమా పాలసీ చేసిన సంస్థలు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని జాతీయ వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.

దోమకాటుకు మనిషి చనిపోయినా పూర్తి స్థాయిలో బీమా సొమ్ము చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. పశ్చిమబెంగాల్‌ కు చెందిన మౌసమీ భట్టాచార్జి భర్త దేవాశీస్ 2012లో మలేరియాతో చనిపోయారు. అతడు అంతకు ముందు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. లోన్‌ తో పాటు బీమా సౌకర్యం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో తన భర్త చనిపోయారని కాబట్టి హౌస్‌ లోన్‌ ను ఇన్సూరెన్స్‌ సొమ్ముతో జమ చేసుకోవాలని దేవాశీస్ భార్య కోరారు. అయితే అందుకు ఇన్సురెన్స్ కంపెనీ తిరస్కరించింది. దోమ కాటు వల్ల చనిపోతే బీమా సొమ్ము చెల్లించడం కుదరదని చెప్పింది. దీంతో ఆమె వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. అక్కడ అనుకూలమైన తీర్పు వచ్చింది.

ట్విస్టు ఏంటంటే తొలుత స్థానిక కోర్టులో ఈ తీర్పురావడంతో పైనున్న కోర్టులు కొట్టేస్తాయని బీమా సంస్థ అనుకుంది. కానీ.. రాష్ట్ర - జాతీయ వినియోగదారుల కమిషన్లు కూడా ఆ తీర్పును సమర్ధించాయి. జాతీయ వినియోగదారుల కమిషన్ లో తీర్పు వెలువరించే సమయంలో జస్టిస్ వికే జైన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దోమ కాటు కూడా ప్రమాదవశాత్తు జరిగేదేనని కాబట్టి అది కూడా ప్రమాదం కిందకే వస్తుందన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇన్సురెన్స్ సొమ్ము చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇప్పటి వరకు పాముకాటు - కుక్క కరవడం వంటి వాటికి మాత్రమే బీమా వర్తిస్తోంది. జాతీయ వినియోగదారుల కమిషన్ తీర్పుతో ఇకపై మలేరియా లాంటి దోమ కాటు మరణాలకు కూడా బీమా వర్తిస్తుందన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/