Begin typing your search above and press return to search.

మెట్రోలకు దెబ్బేయనున్న ‘‘చెన్నై’’ ఎఫెక్ట్

By:  Tupaki Desk   |   18 Dec 2015 5:07 AM GMT
మెట్రోలకు దెబ్బేయనున్న ‘‘చెన్నై’’ ఎఫెక్ట్
X
చెన్నై మహానగరాన్ని ఇటీవల కురిసన భారీ వర్షాలు.. వరదలు ఎంతలా అతలాకుతలం చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ వర్షాలు.. వరదల కారణంగా దాదాపు వారం రోజుల పాటు చెన్నై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు లక్ష కోట్ల రూపాయిలకు పైనే నష్టం వాటిల్లేలా చేసిన ఈ ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోని రంగం లేదు. ఇలా భారీగా ప్రభావితమైన రంగాల్లో బీమా కంపెనీలుగా చెప్పొచ్చు. చెన్నై వరదల కారణంగా.. మోటారు వాహనాలు.. ఆస్తులు విపరీతంగా దెబ్బ తిన్నాయి.

దీంతో.. ఇన్య్సూరెన్స్ క్లెయిమ్స్ భారీ ఎత్తున ఉండొచ్చన్న అంచనా వినిపిస్తోంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. మోటారు వాహనాలకు సంబంధించిన క్లెయిమ్స్ దాదాపు రూ.1500కోట్ల వరకూ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ వాదనను నిజమన్నట్లుగా కొన్ని కంపెనీలకు చెందిన వివరాలు బయటకు వస్తున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక్క ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్య్సూరెన్స్ కంపెనీకే రూ.50కోట్ల మేర క్లెయిమ్ లు వచ్చాయి. అది కూడా 5వేల వాహనాలకు సంబంధించి మాత్రమే. ఈ లెక్కన మిగిలిన బీమా కంపెనీల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.

బీమా కంపెనీలను ఇంతగా ప్రభావితం చేసిన చెన్నై వరదల ఎఫెక్ట్ జనాల మీద ఉంటుందా? అంటే.. సుబ్బరంగా అని చెప్పేస్తున్నారు. చెన్నైవరదల కారణంగా భారీ ఎత్తున వస్తున్న క్లెయిమ్స్ ను సెటిల్ చేస్తున్న బీమా కంపెనీలు.. తమ మీద పడిన అదనపు భారాన్ని వచ్చే ఏడాదిలో దేశంలోని ప్రధాన మెట్రో ప్రజల వాహనదారుల మీద వడ్డించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెట్రో నగరాలైన ఢిల్లీ.. ముంబయి.. కోల్ కతా.. బెంగళూరుకు చెందిన వాహనదారుల బీమా పాలసీపై 10 నుంచి 15 శాతం వరకు ప్రీమియం అధికంగా వసూలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ పెంపును మెట్రో నగరాల మీదనే కాకుండా.. పెద్ద నగరాల మీద కూడా వేస్తే ఎలా ఉంటుందన్న లెక్కల్లో బీమా కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. వచ్చే ఏడాది ప్రీమియం మరికాస్త భారం కావటం ఖాయమంటున్నారు. ఈ విషయాన్ని కొన్ని బీమా కంపెనీల ప్రతినిధులు చూచాయగా అవునని చెప్పటం గమనార్హం. చూస్తుంటే.. చెన్నై మీద వరద పిడుగు.. కాస్త ఆలస్యంగా అయినా.. అందరి మీదా ప్రభావం చూపించటం ఖాయమన్నట్లుందే.