Begin typing your search above and press return to search.

'రాష్ డ్రైవింగ్‌' పై సుప్రీం సంచ‌ల‌న‌ తీర్పు!

By:  Tupaki Desk   |   4 Sep 2018 12:51 PM GMT
రాష్ డ్రైవింగ్‌ పై సుప్రీం సంచ‌ల‌న‌ తీర్పు!
X
గ‌డ‌చిన ప‌దేళ్ల‌లో రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత ప‌డిన‌ వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా జాతీయ ర‌హ‌దారుల‌పై ఈ ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. వీటి అతివేగం వ‌ల్ల‌ - నిర్ల‌క్ష్య‌పు డ్రైవింగ్ వ‌ల్ల జ‌రిగే ప్ర‌మాదాలు కొన్న‌యితే....వాహ‌నాల్లో సాంకేతిక లోపాలు - అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల జ‌రిగే ఘ‌ట‌న‌లు కొన్ని. అయితే, నిర్ల‌క్ష్య‌పు డ్రైవింగ్ చేయ‌డం వ‌ల్ల ఆ వాహ‌నం న‌డిపిన వారితో పాటు ....ఆ వాహ‌నం ఢీకొన‌డం వ‌ల్ల అమాయ‌కులు కూడా బ‌ల‌వుతున్న సంద‌ర్భాలున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా రాష్(నిర్లక్ష్యపు) డ్రైవింగ్ చేసే వారిపై సుప్రీంకోర్టు సంచ‌ల‌న‌ తీర్పును వెలువ‌రించింది. వాహనాన్ని వేగంగా - నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కార‌ణ‌మైన వారికి బీమా వర్తించదని స్పష్టం చేసింది. నిర్ల‌క్ష్యంగా ఆ వాహ‌నం న‌డిపిన వారికి బీమా వ‌ర్తించ‌ద‌ని చెప్పింది. జస్టిస్ ఎన్వీ రమణ - జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌ లతో కూడిన ధర్మాసనం సోమ‌వారం నాడు ఈ కీల‌క‌మైన తీర్పును వెలువరించింది.

దిలీప్ భౌమిక్ అనే వ్యక్తి 2012 మే 20న రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బీమా కోసం ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓ కంపెనీకి దరఖాస్తు చేసుకున్నారు. స్వీయ తప్పిదం వల్లే దిలీప్ ప్రమాదానికి గురయ్యారని బీమా కంపెనీ వాదించింది. దీంతో - ఆ బీమా కంపెనీపై దిలీప్ కుటుంబం త్రిపుర హైకోర్టును ఆశ్ర‌యించింది. దీంతో, దిలీప్ కుటుంబసభ్యులకు రూ.10.57లక్షల బీమా చెల్లించాలని సదరు కంపెనీని కోర్టు ఆదేశించింది. అయితే, ఆ తీర్పుపై బీమా కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు....దిలీప్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లు గుర్తించింది. స్వీయ తప్పిదంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి గురైతే బీమా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది. అయితే, ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి 'పర్సనల్ యాక్సిడెంట్' పాలసీ కింద పరిహారం అందుతుందని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ ప్ర‌కారం దిలీప్ కుటుంబానికి రూ.2లక్షలు బీమా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.