Begin typing your search above and press return to search.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు అవమానం? బండి ఏమన్నారంటే?

By:  Tupaki Desk   |   20 Feb 2022 4:08 AM GMT
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు అవమానం? బండి ఏమన్నారంటే?
X
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఎంత వాడివేడిగా మారిందో తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే కేంద్రంలోని మోడీ సర్కారు మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమర శంఖాన్ని పూరించటం తెలిసిందే.

ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో మరో ఫ్రంట్ దిశగా ఆయన అడుగులు వేయటం.. అందుకు తగ్గట్లు కొత్త మిత్రులతో జట్టు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన కేసీఆర్.. ఈ రోజు (ఆదివారం) మహారాష్ట్రకు వెళ్లి.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఐకానిక్ జాతర మేడారం మహా జాతరకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ప్రధమ పౌరురాలికి అవమానం జరిగిందన్న ఆరోపణ వ్యక్తమవుతోంది.

రాష్ట్ర గవర్నర్ హోదాలో తమిళ సై సౌందర రాజన్ మేడారం జాతరకు విచ్చేవారు. సాధారణంగా రాష్ట్ర గవర్నర్ వచ్చినప్పుడు జిల్లా మంత్రులు.. కలెక్టర్.. ఎస్పీలతో సహా ఉన్నతాధికారులు హాజరవుతారు. కానీ.. తాజాగా మాత్రం అలాంటిదేమీ చోటు చేసుకోకపోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

దీనిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర తొలి పౌరురాలికి ఇంతటి అవమానమా? అని మండిపడుతున్నారు.

గవర్నర్ కు ఇచ్చే మర్యాద ఇదేనా? మహిళ అని చూడకుండా ఇంతలా అవమానిస్తారా? ఇదేనా కల్వకుంట్ల రాజ్యాంగం? అని మండిపడ్డారు. మరోవైపు.. మేడారం జాతరకు వెళ్లకుండా ముఖ్యమంత్రి కేసీఆర్.. గిరిజనులను అవమానించారన్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. అదే సమయంలో.. ప్రోటోకాల్ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకునే వరకు వదిలేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆత్రుతతో పాటు.. ఇప్పుడున్న రాజ్యాంగం సరిగా లేదని.. దాన్ని మార్చాలనే పెద్ద మనిషి.. తన రాష్ట్రంలోని గవర్నర్ కు ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన మర్యాదను కూడా ఇవ్వకపోవటమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.