Begin typing your search above and press return to search.

ఇన్సిపిరేషన్ స్టోరీ: కండక్టర్ నుంచి ఐఏఎస్ దిశగా

By:  Tupaki Desk   |   29 Jan 2020 6:06 AM GMT
ఇన్సిపిరేషన్ స్టోరీ: కండక్టర్ నుంచి ఐఏఎస్ దిశగా
X
పేద కుటుంబం.. చదువుకోవడానికి కానకష్టం.. అందుకే చదువుకు స్వస్తి చెప్పినా.. దూరవిద్య ద్వారా చదువుకున్నాడు.. కుటుంబం గడువకపోవడంతో 19 ఏళ్లకే కండక్టర్ ఉద్యోగంలో చేరాడు.. కాస్త ఆర్థికంగా కుదుట పడ్డాక జీవితం లో ఉన్నత స్థాయికి ఎదగాలని తపనపడ్డాడు.. ఉద్యోగం చేస్తూనే సివిల్స్ పరీక్ష కు కష్ట పడ్డాడు. నిత్యం ఉద్యోగం అయిపోయాక 5 గంటలు సన్నద్ధమయ్యాడు.. ఏకంగా ప్రిలిమ్స్ కు ఎంపికై దేశవ్యాప్తంగా ఆశ్చర్యపరిచాడు.. ఓ కండక్టర్ సివిల్స్ కు ఎంపికయ్యాడన్న వార్త వైరల్ గా మారింది..

పట్టుదల ఉంటే సాధించలేనిది నిరూపించాడు ఈ బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థలో పనిచేస్తున్న కండక్టర్. బస్సు కండక్టర్ నుంచి ఏకంగా సివిల్స్ కు ఎంపికై అబ్బురపరిచాడు. కర్ణాటకలోని మాండ్య జిల్లా మాలవల్లి గ్రామానికి చెందిన కండక్టర్ మధు తాజాగా యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించాడు. మార్చి 25న నిర్వహించబోయే ఇంటర్వ్యూ కు సన్నద్ధమవుతున్నాడు.. ఐఏఎస్ అధికారి అవడమే లక్ష్యంగా ఇంటర్వ్యూ కు సిద్ధమవుతున్నాడు..

మధు సాధించిన గొప్ప ఘనత ఏంటంటే అందరూ సంవత్సరాల తరబడి ప్రఖ్యాత కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటుంటే .. కండక్టర్ మాత్రం పార్ట్ టైమ్ గా చదువుతూ ఎలాంటి కోచింగ్ లేకుండా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం నిత్యం 5 గంటలు స్వతహాగా సిద్ధమయ్యాడు. సీనియర్ల సలహాలు తీసుకున్నాడు. ఆర్టీసీ ఎండీ శిఖ కీలక సూచనలు చేశారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాడు..

విచిత్రం ఏంటంటే.. కండక్టర్ మధు.. దేశంలోనే అత్యుత్తమ ఐఏఎస్ పరీక్ష పాస్ అయినా ఆ విషయం ఆయన తల్లిదండ్రులకు తెలియదు.. అదేంటో కూడా వారికి అర్థం కాలేదట.. కానీ కొడుకు ఏదో సాధించబోతున్నాడన్న సంతోషంలో వారు ఉన్నారట..

ఇలా సంకల్పం ఉంటే సాధించ లేనిది ఏదీ లేదని.. ప్రతిభకు అడ్డు రాదని.. చదువే మనిషిని నిలబెడుతుందని కండక్టర్ మధు నిరూపించాడు. ఉన్నత స్థాయికి ఎదగాలన్న తపనే మధుని నడిపించింది. ఇంటర్వ్యూ హాజరు కాబోతున్న మధుకు దేశ వ్యాప్తంగా అందరూ అభినందనలు తెలుపుతున్నారు. కష్టాల కడలినుంచి ఉన్నత తీరం వైపు అడుగులు వేస్తున్న కండక్టర్ మధు కథ అందరికీ స్ఫూర్తి దాయకం అనడం లో ఎలాంటి సందేహం లేదు.