Begin typing your search above and press return to search.

సిద్ధయ్య ఇక అమరుడు!

By:  Tupaki Desk   |   7 April 2015 12:39 PM GMT
సిద్ధయ్య ఇక అమరుడు!
X
సిమి ఉగ్రవాదులతో వీర పోరాటం చేసిన సిద్ధయ్య తుది శ్వాస విడిచారు. నల్గొండ జిల్లా ఆత్మకూరు మండల ఎస్సై అయిన సిద్ధయ్య వయసు కేవలం 29 సంవత్సరాలే. ముష్కరులతో జరిగిన పోరాటంలో తీవ్రంగా గాయపడి ఆయన ఆస్పత్రిలో చేరిన రోజే ఆయన భార్య అదే ఆస్పత్రిలో చేరి ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు విశ్వప్రయత్నం చేసినా అతని ప్రాణాలను కాపాడ లేకపోయారు. కొడుకు పుట్టాడని సంతోషించాలా, భర్త చనిపోయాడని ఏడవాలా... ఇలాంటి దుస్థితి ఏ మానవుడికీ రాకూడదు... ఆ కుటుంబం పరిస్థితి చూసి రోజూ చావులు, బాధలు చూసే డాక్టర్లకే కళ్లలో నీళ్లు తిరిగాయి.

కోలుకుంటాడనుకున్న సిద్ధయ్య పరిస్థితి క్షణక్షణానికి క్షీణిస్తూ వచ్చింది. సహచర పోలీసులు ఆయనకు భారీగా రక్తదానం చేశారు. డాక్టర్లు ఎంతో ప్రయత్నం చేశారు. ఈ ఉదయం కేసీఆర్‌ ఆస్పత్రికి వచ్చి సిద్ధయ్యను కాపాడుకుంటాం, అవసరమైతే విదేశాలకు వైద్యానికి కూడా తీసుకెళ్తాం అని భరోసా ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన తుదిశ్వాస విడవడం అత్యంత దురదృష్టకరం. సిద్ధయ్య మరణవార్త ఆయన కుటుంబాన్ని, ఆయన గ్రామాన్నే కాదు, మొత్తం తెలంగాణను కలచివేసింది. కన్నీరు పెట్టించింది.

సిద్ధయ్యది కర్నూలు జిల్లా. ఆయన పాలమూరులో స్థిరపడ్డారు. పెరిగింది, చదివింది పాలమూరు జిల్లాలోనే. బంగారు వ్యాపారంలో కొనసాగిన సిద్ధయ్య ప్రభుత్వ పోలీసు సర్వీసుకు ఎంపికయ్యారు. వీరి కుటుంబానికి బంగారు వ్యాపారం కారణంగా పాలమూరు జిల్లాలోని ప్రతి ఊరితో సంబంధాలున్నాయి. దీంతో పాలమూరు మొత్తం బోరుమంది.

సిద్ధయ్య అమరుడు. సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుడు.