Begin typing your search above and press return to search.

సైకో సూదిగాడు... సీసీ కెమెరాకు చిక్కాడు

By:  Tupaki Desk   |   12 Sep 2015 8:46 AM GMT


సైకో సూదిగాడు... మొన్న‌టి వ‌ర‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు, కొద్దికాలం నుంచి తెలంగాణ‌లో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇరు రాష్ర్టాల్లోనూ బీభ‌త్సం సృష్టిస్తున్న ఇంజెక్షన్ సైకో సీసీ కెమెరాకు చిక్కాడు. నల్లని హోండా షైన్ బైక్ పై తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలు - యువతులు - పిల్లలు - పురుషులపై ఇంజెక్షన్ సూది గుచ్చేసి అదృశ్యమైపోతున్నాడు. సీసీ కెమెరాలో ఆగంతకుడి కదలికలు రికార్డు అవడంతో ఈ కేసులో కొంత పురోగతి సాధించినట్లైంది. ఇంజెక్షన్ సైకోను పట్టుకునేందుకు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 160 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. మొత్తం 49 చెక్-పోస్టుల వద్ద గట్టి నిఘాను, భద్రతను ఏర్పాటు చేశారు. 400 మంది పోలీసులను వివిధ బృందాలుగా ఏర్పాటు చేసి సైకో జాడ కోసం గాలిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇంజెక్షన్ సూది బాధితులు చెబుతున్న పోలికలు ఉన్న ఒక వ్యక్తిని తమ దగ్గర ఉన్న ఒక సీసీ కెమెరా ఫుటేజిలో గుర్తించామని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ప్ర‌క‌టించారు. ఈ సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా ఇక నుంచి సూది సైకో కోసం గాలింపు మరింత వేగవంతం చేస్తామని వారు తెలిపారు. బ్లాక్ హోండా షైన్ బైక్ పై సూది సైకో తిరుగుతున్నాడని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం మీడియాకు వెల్లడించిన నేప‌థ్యంలో పోలీసులు భ‌ద్ర‌త మ‌రింత పెంచారు. మ‌రోవైపు భీమవరంలో పల్సర్ బైక్ పై వెళ్తున్న ముగ్గుర్ని స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. త్వ‌ర‌లోనే సైకో సూదిగాడికి చెక్ పెట్టే అవకాశాలున్నాయ‌ని తెలుస్తోంది.