Begin typing your search above and press return to search.

నేర చరితులు ఎన్నికల్లో పోటీపై సుప్రీం కీలక తీర్పు!

By:  Tupaki Desk   |   10 Dec 2020 12:06 PM IST
నేర చరితులు ఎన్నికల్లో పోటీపై సుప్రీం కీలక తీర్పు!
X
ఎన్నికల్లో నేర చరిత్ర గల వారి పోటీపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మరోసారి కీలక తీర్పు వెల్లడించింది. ఏదైనా నేరానికి పాల్పడి దోషిగా నిర్ధారణ అయి, రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పొందినవారు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ దోషిగా నిర్ధారణ అయిన తర్వాత ఆ ఉత్తర్వులపై న్యాయస్థానం స్టే విధించినా పోటీకి అర్హులవుతారని వెల్లడించింది. ఈ మేరకు కేరళ సోలార్ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ల త్రిసభ్య ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ... సోలార్ కుంభకోణం కేసులో కేరళకు చెందిన సరితా నాయర్ ‌కు మూడేళ్ల జైలు శిక్ష ఖరారు అయింది. దీంతో 2019 లోక్‌ సభ ఎన్నికల్లో ఎర్నాకులం, వాయనాడ్‌ స్థానాలకు ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించారు. దోషిగా తేలినా తనకు విధించిన శిక్షపై అప్పీలేట్‌ కోర్టు స్టే విధించడంతో ఎన్నికల్లో పోటీకి అర్హురాలేనంటూ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో ఆమె సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. తాజాగా సుప్రీం కోర్టులోనూ ఆమెకు చుక్కెదురయ్యింది. శిక్ష అమలును మాత్రమే సస్పెన్షన్‌లో ఉంచారని, దోషిగా నిర్ధరించటంపై స్టే ఇవ్వలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కాబట్టి, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం రిటర్నింగ్‌ అధికారి తీసుకున్న నిర్ణయం సరైనదేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎర్నాకులం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి హిబీ ఎడెన్ విజయం సాధించారు. దీంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని కోరుతూ సరితా నాయర్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.