Begin typing your search above and press return to search.

కేంద్రం మాటః హోదా ఇస్తే...ఏపీకే ఫ‌స్ట్‌

By:  Tupaki Desk   |   23 Jan 2017 5:18 AM GMT
కేంద్రం మాటః హోదా ఇస్తే...ఏపీకే ఫ‌స్ట్‌
X
ఏపీపై కేంద్రానికి ప్రత్యేక అభిమానం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి - ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జీ ఇంద్రజిత్‌ సింగ్‌ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్‌ కు తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన ఆయన, ముందుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజి అమలు ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రానికీ హోదా ఇచ్చే అవకాశం లేదని చెప్పారు.

ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న సినీనటులు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు మద్దతు ఇవ్వకపోవడం సరికాదని విభజన హామీ సాధన సమితి అధ్యక్షుడు - ఆంధ్రా మేథావుల ఫోరం ఛైర్మన్‌ చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తమిళ నటులను ఆదర్శంగా తీసుకుని తెలుగు చిత్రసీమకు చెందిన నటులు ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా సాధన కోసం ముందుకు రావాలని కోరారు. విజయవాడ ప్రెస్‌ క్లబ్‌ లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జల్లికట్టు విషయంలో తమిళుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన తమిళ నటులు జల్లికట్టు ఉద్యమంలో భాగస్వాములైన విషయాన్ని చలసాని గుర్తు చేశారు.రాజకీయాలతో సంబంధం లేని రజనీకాంత్‌ - కమలహాసన్‌ వంటి నటులు కూడా జల్లికట్టు ఉద్యమానికి మద్దతు తెలపటం విశేషమని చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌ పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్‌ సహా చిత్ర పరిశ్రమకు చెందిన నటులందరూ తాము చేసే ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. విద్యార్థులు, యువజనులతో కలిసి విశాఖ బీచ్‌ లోగానీ - కృష్ణానది తీరంలోగానీ ఆందోళన చేపట్టాలనే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/