Begin typing your search above and press return to search.

అమరావతిలో రాత్రీ పగలూ ఒక్కటే

By:  Tupaki Desk   |   24 Sept 2015 5:00 PM IST
అమరావతిలో రాత్రీ పగలూ ఒక్కటే
X
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రాత్రి కూడా పగటి పూట తరహాలో దేదీప్యమానంగా వెలిగిపోనుంది. మూడేళ్లలో విద్యుత్తు వెలుగులతో అలరారనుంది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.200 కోట్ల రుణం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ.. రాజధాని ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్తును అందించనుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రణాళిక రూపకల్పన జరుగుతోంది.

రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం.. అమరావతిలో విద్యుత్తు లైన్లు ఒక్కటి కూడా పైకి కనిపించవు. ప్రమాదరహితంగా సురక్షిత భూగర్భ లైన్లు వేస్తారు. ఇండోర్ సబ్ స్టేషన్లు నిర్మిస్తారు. 60 నుంచి 100 ఫీట్ల రోడ్లకు ఇరువైపులా రెండేసి రెండేసి చొప్పున నియాన్ లైట్లను అమరుస్తారు. వాటి మధ్యలో ఉద్యాన వనాలు, వాటర్ ఫౌంటెన్లు ఏర్పాటు చేయడంతోపాటు వాణిజ్య ప్రాంతాలను వెలుగులమయం చేస్తారు.

మరి ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో విద్యుత్తు స్తంభాలు ఉన్నాయి కదా.. రాజధాని నిర్మాణ పనులకు అడ్డుగా ఉండే విద్యుత్తు స్తంభాలు, లైన్లను అన్నిటినీ అతి త్వరలోనే తొలగిస్తారు. అంటే, నవ్యాంధ్ర పరిధిలో ఉన్న గ్రామాలు మినహా మిగిలిన పొలాల్లోని విద్యుత్తు లైన్లు అన్నిటినీ తొలగిస్తారన్నమాట.

ప్రస్తుతం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి కృష్ణాజిల్లా నున్న వరకు, ఇబ్రహింపట్నం వీటీపీఎస్ నుంచి తాడికొండ వరకు రాజధాని గ్రామాల మీదుగా విద్యుత్తు లైన్లు వెళుతున్నాయి. అండర్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే వాటన్నిటినీ తొలగించాల్సిందే. అంతేనా.. రాజధాని పరిధిలో 500, 400, 320, 120 కేవీ లైన్లు అన్నిటినీ తొలగించాల్సిందే. రాజధాని గ్రామాల్లో 4000 పంపుసెట్ కనెక్షన్లు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అతి త్వరలోనే తొలగించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు ఉన్న విద్యుత్తు వ్యవస్థ మొత్తం మారిపోయి సరికొత్త విద్యుత్తు వ్యవస్థ రానుంది.