Begin typing your search above and press return to search.

కొత్త విషయం:ఇందిరమ్మ నోట వారసురాలి మాట

By:  Tupaki Desk   |   20 Oct 2015 6:02 AM GMT
కొత్త విషయం:ఇందిరమ్మ నోట వారసురాలి మాట
X
ఈ లోకంలో లేని వారికి సంబందించిన సౌలభ్యం చాలానే ఉంటుంది. వారు అలా అన్నారని.. అలా చేశారని చెప్పుకునే అవకాశం ఉంది. నిజంగా అన్నారా? లేదా? అన్న విషయాలు నలుగురి ముందుకు వచ్చిన చెప్పే అవకాశం ఉండదు. వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో ఖండించే అవకాశం ఉంటుంది కానీ.. అందుకు భిన్నమైన అంశాల్లో ఆసక్తి.. చర్చ ఉంటుందే తప్ప రచ్చ ఉండదు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ వృద్ధ నేత.. ఇందిరమ్మకు నమ్మిన బంటు అయిన ఫోతేదార్ తాజాగా ఇందిరమ్మ మనసును ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన.. ఇందిరమ్మ తాను చనిపోవటానికి మూడు రోజుల ముందు తనతో అన్న మాటల గురించి నాటకీయంగా బయటపెట్టారు.

ఇందిరమ్మ చనిపోయిన తర్వాత కానీ.. ఆమె తర్వాత పగ్గాలు చేప్టటిన రాజీవ్ హయాంలో కానీ.. పీవీ పాలన సమయంలోనూ.. ఆఖరికి మన్మోహన్ పదేళ్ల పాలన సందర్భంగా కానీ బయటకు చెప్పని విసయాల్ని వెల్లడించి ఆసక్తి రేకెత్తించేలా చేశారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఇందిరమ్మ చనిపోవటానికి మూడు.. నాలుగు రోజుల ముందు తాము కాశ్శీర్ లోని ఒక ఆలయానికి వెళ్లామని.. ఈ సంద్భంగా ఆమె తన మనసులోని మాటను చెప్పినట్లుగా ఫోతేదార్ వెల్లడించారు.

ప్రియాంకగాంధీని తన వారసురాలిగా చేయాలన్న ఆకాంక్షను ఇందిరమ్మ వ్యక్తం చేశారని ఆయన వెల్లడించారు. తన మాదిరిగా పోలికలు ఉండే ప్రియాంక దేశానికి గొప్ప నేత అవుతారని.. ఆమెకు ఆ శక్తి ఉన్నట్లుగా ఇందిర మాటలు తనకు అనిపించాయని చెప్పారు. ‘‘ఆ రోజు కాశ్శీర్ లో దేవాలయాన్ని సందర్శించుకున్న తర్వాత ప్రియాంక ప్రస్తావన తీసుకొచ్చారు. ఆమె గురించి చాలా చెప్పుకొచ్చారు. ఆ రాత్రి ఇందిర నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను రాసుకున్నా. ఆమె మాటల్ని చూస్తే.. బహుశా తన తరవాత వారసురాలిగా ప్రియాంకగా ఆమె భావించి ఉంటారని ఆమె మాటల్ని వింటే అర్థమైంది’’ అని చెప్పుకొచ్చారు. తర్వాత ఆ మాటల్ని తాను రాజీవ్ కు.. సోనియాకు చెప్పానని ఫోతేదార్ వెల్లడించారు.

రాహుల్ నాయకత్వ సామర్థ్యం మీద సందేహాలు వ్యక్తమవుతున్న సమయంలో.. నాటకీయంగా నాటి ఇందిర నోటి నుంచే ప్రియాంక మాట వచ్చిందని చెప్పటం ద్వారా ఫోతేదార్.. కాంగ్రెస్ లో కొత్త చర్చను షురూ చేశారని చెప్పకతప్పదు.