Begin typing your search above and press return to search.

ఇండిగో ఎయిర్లైన్స్కు జరిమానా.. ఆ పిల్లాడిని ఫ్లైట్ ఎక్కనీయకపోవడమే కారణం

By:  Tupaki Desk   |   29 May 2022 5:30 PM GMT
ఇండిగో ఎయిర్లైన్స్కు జరిమానా.. ఆ పిల్లాడిని ఫ్లైట్ ఎక్కనీయకపోవడమే కారణం
X
దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్కు జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.5 లక్షల జరిమానా విధించింది. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారి పట్ల అమానుషంగా, అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఆ ఎయిర్లైన్స్ సిబ్బందిపై మండిపడింది. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల నిర్వహణ లోపం.. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసి చిన్నారిని మానసికంగా ఇబ్బందికి గురి చేసిందని డీజీసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. అసలేం జరిగిందంటే..

ప్రత్యేక అవసరాలు కలిగిన ఓ పిల్లాడు తన తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ వెళ్లడానికి రాంచీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. తీరా అక్కడికి వెళితే ఆ సిబ్బంది ఆ పిల్లాడిని ఫ్లైట్ ఎక్కడానికి నిరాకరించారు. పిల్లాడు చూడ్డానికి కాస్త భయంకరంగా ఉన్నాడని.. అతడి వల్ల ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడతారని విమానం ఎక్కనివ్వలేదు.

తమ కుమారుడిని ఫ్లైట్ ఎక్కనీయకపోవడంతో ఆ తల్లిదండ్రులు కూడా వారి ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఇదంతా గమనించిన అక్కడి తోటి ప్రయాణికురాలు ఈ ఘటనను వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది ప్రవర్తన తనని విస్మయానికి గురి చేసిందంటూ చెప్పారు. తను ఆ వీడియోను కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్యాగ్ చేశారు.

దీనిపై స్పందించిన జ్యోతిరాదిత్య ఈ ఘటనను ఖండించారు. ప్రజల్లో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్వయంగా తానే ఈ విచారణ ను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. స్వయంగా కేంద్రమంత్రి ఈ కేసు విచారణ పర్యవేక్షిస్తుండటంతో రంగంలోకి దిగిన డీజీసీఏ ఇండిగో ఎయిర్లైన్స్కు రూ.5 లక్షల జరిమానా విధించింది. ఇండిగో గ్రౌండ్ సిబ్బంది ప్రత్యేక పిల్లల నిర్వహణ లోపం, పరిస్థితిని మరింత తీవ్రతరం చేసిందని గుర్తించినట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కాస్త మానవత్వంతో వ్యవహరించాలని డీజీసీఏ పేర్కొంది. ఇండిగో సిబ్బంది సందర్భానికి తగ్గట్టు వ్యవహరించడంలో విఫలమయ్యారని తెలిపింది. పౌరవిమానయాన నిబంధనల స్ఫూర్తికి పూర్తి విఘాతం కలిగించేలా ప్రవర్తించినట్లు గుర్తించామని వెల్లడించింది. సంబంధిత ఎయిర్క్రాఫ్ట్ నిబంధనల ప్రకారం ఇండిగో ఎయిర్లైన్స్కు రూ.5 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.

ఇండిగో మేనేజర్ మే 7న రాంచీ విమానాశ్రయం లో ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఓ ఫిర్యాదు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్ తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన జరిగినప్పుడు అభినందన్ మిశ్రా అనే వ్యక్తి అక్కడే ఉన్నాడని ఆ ప్రకటనలో తెలిపింది. ఆ పిల్లవాడు ఎయిర్పోర్టుకు కారులో ప్రయాణించి రావడం వల్ల కాస్త అనారోగ్యానికి గురయ్యాడు.

బోర్డింగ్ గేట్ వద్దకు రాగానే మరింత ఒత్తిడికి లోనయ్యాడు. అతని ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు అతణ్ని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. కానీ బోర్డింగ్ సమయంలో పిల్లవాడు పరిస్థితి నార్మల్గా లేకపోవడం వల్ల ఫ్లైట్ ఎక్కితే ఏదైనా జరుగుతుందేమోనన్న కారణంతోనే ఎయిర్ పోర్ట్ సిబ్బంది నిరాకరించారని మిశ్రా తెలిపినట్లు ఇండిగో తన ప్రకటనలో పేర్కొంది.

కానీ ఫిర్యాదులో మాత్రం ఇండిగో మేనేజర్.. ఆ పిల్లాడి ప్రవర్తనను ఓ తాగుబోతు ప్రవర్తనతో పోల్చి అతడి వల్ల ఇతర ప్రయాణికులకు ప్రమాదం అని అందుకే ఫ్లైట్ ఎక్కనివ్వలేదని పేర్కొన్నారు. అతడి చర్యను పలువురు ప్రయాణికులు వ్యతిరేకించినా.. మేనేజర్ వెనక్కి తగ్గకుండా పిల్లాడి పట్ల అతడి తల్లి దండ్రులతోనూ దురుసుగా వ్యవహరించడం వల్లే ఫిర్యాదు నమోదైందని.. ఆ ఫిర్యాదు ప్రకారం చర్యలు తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది.