Begin typing your search above and press return to search.

అందరినీ ఇరకాటంలో పడేసిన సర్వే

By:  Tupaki Desk   |   19 Aug 2021 12:00 PM IST
అందరినీ ఇరకాటంలో పడేసిన సర్వే
X
ప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టు డే సంస్ధ బయటపెట్టిన తాజా సర్వేతో అన్నీ పార్టీల అధినేతలు ఇరుకునపడిపోయారు. ప్రతినెల ఇండియా టు డే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే పేరుతో దేశంలోని అన్నీరాష్ట్రాల్లో సర్వేలు చేస్తుంటుంది. నిజానికి ఈ సర్వేకు శాస్త్రీయంగా ఉన్న విశ్వసనీయత ఏమిటన్న విషయాన్ని పక్కనపెట్టేద్దాం. ఎందుకంటే సగటున 15 వేల శాంపిళ్ళను ఇండియా టు డే సేకరిస్తుంది. కోట్ల ఓటర్లున్న మనరాష్ట్రంలో 15 వేల శాంపిళ్ళు ఏ మూలకీ సరిపోదు. దీనివల్ల ఏ నేతకు ప్లస్ వచ్చినా లేదా మైనస్ వచ్చినా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరంలేదు. ఈ సర్వేలాధారంగా జనాలు ఓట్లేయరుకాబట్టి.

తాజా సర్వేలో వెల్లడైన విషయం ఏమిటంటే మిగిలిన రాష్ట్రాలను వదిలిపెట్టేస్తే నరేంద్రమోడి, కేసీయార్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురి ఇమేజీ లో స్పష్టమైన డౌన్ ఫాల్ కనబడింది. అంటే మోడి ఇమేజి పడిపోయిందని ఆరోపించేందుకు కాంగ్రెస్+ఎన్డీయే వైరి పక్షాలకు మంచి ఆయుధం దొరికినట్లయ్యింది. మోడిని 24 శాతంమంది జనాలు మాత్రమే ప్రధానమంత్రిగా ఓకే చేశారు. అంటే మిగిలిన 76 శాతంమంది వ్యతిరేకిస్తున్నట్లే లెక్క. అయితే ఇది నాన్ ఎన్డీయే పక్షాలకు మంచి ఆయుధమే కానీ ప్రతిపక్ష నేతల గ్రాఫ్ కూడా ఏమీ పెరగలేదు. దాంతో మోడిపై ఏమి మాట్లాడాలో విపక్షాలకు అర్ధం కావటంలేదు.

సరే ఇక తెలుగురాష్ట్రాలను చూస్తే తెలంగాణాలో కేసీయార్ ఇమేజి మరింత దారుణంగా పడిపోయింది. కేసీయార్ పాలనను 84 శాతంమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే కేసీయార్ పాలనకు వ్యతిరేకంగా రెచ్చిపోయేందుకు కాంగ్రెస్, బీజేపీలకు అవకాశం లేకుండా చేసింది ఈ సర్వే. ఎందుకంటే జాతీయస్ధాయిలో మోడి ప్రభ కూడా అలాగే దిగజారిపోయింది కాబట్టి. ఇక కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నట్లుగా ఉంది సర్వే. కాబట్టి సర్వే ఫలితాలను బట్టి మోడి, కేసీయార్ పై ప్రతిపక్షాలు దండెత్తేందుకు లేదు.

ఇక ఏపి విషయం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇమేజి కూడా పడిపోయింది. ఒకపుడు దేశంలోనే నెంబర్ 1 ర్యాంకులో ఉన్న జగన్ ఇమేజి మెల్లి మెల్లిగా దిగజారిపోయి తర్వాత జూలై మాసంలో కాస్త పుంజుకున్నది. దీని ఆధారంగా టీడీపీ, బీజేపీలు జగన్ పై రెచ్చిపోయే అవకాశం లేదు. ఎందుకంటే సర్వేలో అసలు జనాలు చంద్రబాబునాయుడు గురించి పట్టించుకోనేలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీలు కూడా ఆత్మరక్షణలో పడిపోయాయి కాబట్టే సర్వే ఫలితాల గురించి ఏ పార్టీ కూడా నోరిప్పటంలేదు.

ఇవన్నీ పక్కనపెట్టేస్తే అసలు విషయం మరోటుంది. అదేమిటంటే ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ర్యాంకు స్ధిరంగా ఉండటం. ఎన్నిసార్లు సర్వేలు జరిపినా నవీనుడి ర్యాంకు మాత్రం కాస్త అటు ఇటుగానే ఉంటోంది. అంటే తమ రాష్ట్రంలో నవీన్ పాలనపట్ల జనాలు చాలా సంతృప్తిగా ఉన్నారనే అనిపిస్తోంది. కేసీయార్+జగన్ లాగ తన రాష్ట్రంలో నవీన్ పంచుడు ప్రోగ్రాములేవీ పెట్టుకోలేదు. అయినా మంచి ఆధరణ ఎలా సాధ్యమైంది ? ఎలాగంటే ప్రచారానికి దూరంగా ఉంటు నిజమైన ప్రజాపాలన చేయబట్టే. ఈ విషయాన్ని గమనిస్తే రాష్ట్రాలకు మంచిదని తెలుగు సీఎంలు గ్రహించాలి.