Begin typing your search above and press return to search.

30 లలోనే బెంజ్ లు ఆడిలతో ఇండియన్ యూత్

By:  Tupaki Desk   |   16 Dec 2015 4:08 AM GMT
30 లలోనే బెంజ్ లు  ఆడిలతో ఇండియన్ యూత్
X
తల్లితండ్రులకు ఉండే కోట్ల ఆస్తితో ఎంజాయ్ చేసే పిల్లలు ప్రపంచంలో చాలామందే ఉంటారు. కానీ.. యువ భారతంలో సరికొత్త దృశ్యం ఒకటి ఈ మధ్య చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్న డిజిటల్ యుగంలో కష్టపడి పని చేయటం.. విభిన్నంగా ఆలోచించటం ద్వారా అద్భుతమైన అవకాశాల్ని చేజిక్కించుకుంటున్న యువతరం.. ఖరీదైన.. విలాసవంతమైన కార్లను చిన్న వయసులోనే కొనేస్తున్న వైనం తాజాగా బయటకు వచ్చింది.

మెర్సిడెజ్ బెంజ్.. ఆడి.. బీఎం డబ్య్లూ లాంటి విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయటానికి లేట్ ఫార్టీస్ తో మొదలు పెట్టేవారు. కానీ.. మారిన కాలంతో పాటు.. అవకాశాల పుణ్యమా అని.. వాటిని చేజిక్కించుకుంటున్నపలువురు యూత్.. విలాసవంతమైన కార్లను ‘‘థర్టీస్’’ లోనే సొంతం చేసుకోవటం ఇప్పుడు లెటెస్ట్ ట్రెండ్ గా మారింది. ఎక్కడివరకో ఎందుకు మెర్సిడెజ్ బెంజ్ కార్ల కొనుగోళ్లను చూస్తే.. గతంలో సరాసరి 44 ఏళ్ల వయసులో కొనుగోళ్లు చేసే వారు ఎక్కువగా ఉండే వారు. ఇప్పుడది 37 ఏళ్లకు తగ్గిపోయింది.. అది కూడా మూడేళ్ల స్వల్పకాలంలో. ఒక్క బెంజ్ విషయంలోనే కాదు.. ఆడి.. బీఎండబ్ల్యూ లాంటి కార్ల విషయంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపించటం గమనార్హం.

ఇక జర్మనీ వాహన దిగ్గజం ఆడి సంగతే చూస్తే.. ఈ కార్లను సొంతం చేసుకుంటున్న వారిలో 30.. 35 లోపు వారు ఈ మధ్యన ఫెరిగినట్లుగా వాహన రంగ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ‘ఆడి’ సొంతం కావాలంటే 47 ఏళ్ల వరకు పట్టేది. ఇక.. మిలియనీర్లు అవుతున్న యువ భారతీయుల వయసు కూడా తగ్గుతోంది. గతంలో మిలియనీర్ అంటే.. ఫిఫ్టీస్ లో ఉండే వారు. అదికాస్తా ఇప్పుడు 30 – 40 మధ్యలోనే అయిపోవటం గమనార్హం.

ఇక.. యూత్ కొంటున్న విలాసవంతమైన కార్లలో అత్యధికం.. మెర్సిడెజ్ ‘‘ఎ’’ క్లాస్.. ఆడి ‘‘క్యూ3’’.. బీఎండబ్ల్యూ ‘‘ఎక్స్ 1’’. యువతరం కొంటున్న విలాసవంతమైన కార్లలో అత్యధికం ఎంట్రీ లెవల్ వే ఉంటున్నట్లు చెబుతున్నారు. దేశంలో విలాసవంతమైన కార్ల అమ్మకాల వృద్ధిరేటు15 శాతంగా ఉంది. రానున్న రోజుల్లో మరికాస్త జోరందుకోవటం ఖాయమన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

మారిన ఆలోచనా ధోరణితో పాటు.. చిన్న వయసులోనే అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోవటంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న యువతరం.. విలాసవంతమైన వాహనాల్ని వెనుకాడటం లేదు. కెరీర్ మొదట్లోనే అత్యుత్తమ స్థాయిలో ఉండటం.. భవిష్యత్తు అంతకు మించి బాగుంటుందన్న భావన వారి చేత పెద్ద పెద్ద కార్లను చిన్న వయసులోనే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీనికి తోడు.. స్టార్టప్ ల ట్రెండ్ కూడా విలాసవంతమైన కార్ల వినియోగాన్ని పెంచటానికి కారణంగా చెప్పొచ్చు.