Begin typing your search above and press return to search.

చైనా కంపెనీలకు భార‌త్ సొత్తు.. పెట్టుబడి లేకుండానే.. వేల కోట్ల ఆర్జన..!

By:  Tupaki Desk   |   10 Feb 2021 5:05 PM IST
చైనా కంపెనీలకు భార‌త్ సొత్తు.. పెట్టుబడి లేకుండానే.. వేల కోట్ల ఆర్జన..!
X
వ్యాపారం చేయాలంటే దానికి త‌గిన ముంద‌స్తు ప్ర‌ణాళిక ఉంటుంది.బిజినెస్ స్థాయిని బ‌ట్టి పెట్టుబ‌డి స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుంది.. ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ మొద‌లు.. ఉత్ప‌త్తి.. మార్కెటింగ్ స‌వాల‌క్ష గొడ‌వ‌లుంటాయి. ఇవ‌న్నీ స‌రిగ్గా స‌క్సెస్ అయితే.. అప్పుడు లాభాల గురించిన చ‌ర్చ‌. కానీ.. మోసం చేయ‌డానికి ఇవ‌న్నీ అవ‌స‌రం లేదుగా..?! అమాయ‌కుల‌ను టార్గెట్ చేసి, ప్లాన్ అమ‌లు చేస్తే ఖ‌తం! స‌రిగ్గా.. ఇదే సూత్రాన్ని ఫాలో అయిపోయ‌యి చైనా కంపెనీలు. మ‌న దేశంలోని లోఫ‌ర్ల‌ను ఏజెంట్లుగా పెట్టుకొని, ఒక్క పైసా పెట్టుబ‌డి లేకుండా, కేవ‌లం నాలుగు నెల‌ల్లోనే వేలాది కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టాయి. న‌మ్మ‌శ‌క్యం కాక‌పోయినా ఇదే వాస్త‌వం!

లోన్ యాప్ ల పేరిట‌..
'లోన్ యాప్‌..' ఇదే చైనా కంపెనీల‌ ఆయుధం. ఇవాళ రేపు డ‌బ్బు అవ‌స‌రం లేనోళ్లు ఎవ‌రైనా ఉంటారా? అప్పుడు ఇచ్చే వాళ్లు దొర‌క‌రుగానీ.. తీసుకునే వాళ్లు కోకొల్ల‌లు. ఇలాంటి స‌మ‌యంలో మేం అప్పిస్తాం అంటూ వ‌చ్చేశాయి 'లోన్ యాప్'లు. ఎలాంటి ష్యూరిటీ లేకుండా రుణాలు ఇస్తామంటూ లైన్లోకి వ‌చ్చేశాయి. ఇంకేముందీ..? ఈ వార్త ఆనోటా ఈనోటా రోజుల వ్య‌వ‌ధిలోనే దేశం మొత్తం విస్త‌రించిపోయింది. దీంతో అవ‌స‌రాలు ఉన్న‌వాళ్లంతా ఆ యాప్ ల‌తో ట‌చ్ లోకి వెళ్లారు. వారి నుంచి, ఇక్కడి ఏజెంట్ల నుంచీ వేల కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేశాయి చైనీస్ కంపెనీలు!

ఢిల్లీ కేంద్రంగా..
ఈ మోసం ఎలా జ‌రిగిందా? అని పోలీసులు విచార‌ణ చేస్తుండ‌గా.. ఊహించ‌ని విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ వ్య‌వ‌హారం మొత్తం ఢిల్లీ కేంద్రంగా సాగింది. బ్యాంకులు కాకుండా.. వ్య‌క్తిగ‌త రుణాలు ఇచ్చే ఇత‌ర సంస్థ‌లతో పొత్తు పెట్టుకొని ఈ దందా కొన‌సాగించాయి డ్రాగ‌న్ కంపెనీలు. దీంతో.. ఏయే కంపెనీల‌తో ఒప్పందాలు చేసుకున్నాయ‌నే విచార‌ణ చేస్తున్నారు పోలీసులు.

మైక్రో ఫైనాన్స్ మాదిరిగానే..
గ‌తంలో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించిన మైక్రో ఫైనాన్స్ సంస్థ‌ల మాదిరిగానే ఈ సంస్థ‌లు కూడా అవ‌స‌రాలు ఉన్న‌వారిని టార్గెట్ చేశాయి. ప్రధానంగా.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, యువ‌కుల‌కు ఎర‌వేశాయి. లోన్ యాప్ ల ద్వారా ఈజీగా రుణాలు పొందండి.. చిన్న చిన్న మొత్తాల్లో తీర్చేయండి అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశాయి. దీంతో.. అవ‌స‌రాలు ఉన్న‌వారంతా క్యూ క‌ట్టారు. చెప్పిన స‌మ‌యానికి చెల్లిస్తే కొంత వ‌డ్డీ.. అది దాటితో మ‌రింత వ‌డ్డీ అనే కాన్సెప్ట్ తో రంగంలోకి దిగిన ఈ కంపెనీల వ‌ల‌లో వేలాది మంది చిక్కుకున్నారు.

దాదాపు 250 యాప్ లు...
ఈ మ‌నీ లోన్ యాప్ ల‌ను ఒక‌టీ రెండు కాదు.. దాదాపు 250కి పైగానే త‌యారు చేయించాయి చైనా కంపెనీలు. ఇక్క‌డి రుణ సంస్థ‌ల‌ను మ‌ధ్య‌వ‌ర్తిగా పెట్టుకున్నాయి. లోన్లు తీసుకునేలా ప్ర‌జ‌ల‌ను మోటివేట్ చేయ‌డం.. వారికి రుణాలు ఇప్పించ‌డం.. తిరిగి వ‌సూలు చేయ‌డం మొత్తం భార‌తీయ రుణ సంస్థ‌ల బాధ్య‌తే. యాప్ ల ద్వారా రుణాలు తీసుకోండి అంటూ వీరే విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ విధంగా ఒక్క మ‌నిషికే 20 నుంచి 30 యాప్ ల ద్వారా రుణాలు ఇప్పించిన‌ట్టు స‌మాచారం.

బాధ్య‌త మాదే..
జ‌నాలు తీసుకున్న డ‌బ్బులు తిరిగి చెల్లించే బాధ్య‌త మొత్తం ఇక్క‌డి సంస్థ‌లే తీసుకున్నాయ‌ట‌! ఇందుకు గానూ చైనా కంపెనీలు వ‌చ్చే వ‌డ్డీలో ఇక్క‌డి సంస్థల‌‌కు 15 శాతం వాటా చెల్లించాల‌ని ఒప్పందాలు చేసుకున్నాయి. డ‌బ్బులు తిరిగి చెల్లించ‌లేక‌పోతే తామే చెల్లిస్తామంటూ పూచీక‌త్తుగా సంత‌కాలు చేశాయి ఇక్క‌డి రుణ సంస్థ‌లు. ఆ విధంగా.. ఈ సంస్థ‌ల‌న్నీ అవ‌స‌రాలు ఉన్న జ‌నాల‌కోసం వేట సాగించాయి. ఇలా ఒక‌టీ కేవ‌లం 6 నెల‌ల్లోనే.. చైనాకు చెందిన ఆరు కంపెనీలు.. రూ.25 వేల కోట్ల లావాదేవీలు నిర్వ‌హించిన‌ట్లు పోలీసులు క‌నుగొన్నారు.

అద‌న‌పు వ‌డ్డీతో..
ఇక్క‌డి సంస్థ‌ల‌కు 15 శాతం వాటా ఇవ్వాల్సి ఉండ‌డంతో.. రుణాలు తీసుకున్న ప్ర‌జ‌ల నుంచి 30 శాతం మేర వ‌డ్డీ వ‌సూలు చేశాయి చైనా కంపెనీలు. అయితే.. రుణాలు తీసుకున్న వారిలో దాదాపు 40 శాతం మంది ప్ర‌జ‌లు తిరిగి చెల్లించ‌లేక‌పోయారు. దీంతో.. ముంద‌స్తుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం.. ఇక్క‌డి సంస్థ‌లు చైనా కంపెనీలకు న‌గ‌దు చెల్లించాయి. మొత్తంగా.. రూపాయి పెట్టుబ‌డి లేకుండా వేల కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టాయి చైనా కంపెనీలు. ఈ వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఆయా కంపెనీల‌తో పాటు ఇక్క‌డ స‌హ‌క‌రించిన వారిని గుర్తించే ప‌నిలో ప‌డ్డాయి.