Begin typing your search above and press return to search.

స్పెషల్ స్పీచ్ - మోడీ ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   8 Aug 2019 7:31 PM GMT
స్పెషల్ స్పీచ్ - మోడీ ఏం చెప్పారు?
X
ప్రధాని నరేంద్ర మోదీ... తాను అనుకున్నట్లుగానే జమ్మూ కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టేశారు. కశ్మీర్ విభజన కోసం కేంద్ర హోం మంత్రి హోదాలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి పక్కా ప్రణాళిక రచించిన మోదీ... వ్యూహం ఎక్కడ కూడా బెడిసికొట్టకుండా జాగ్రత్త పడ్డారు. మోదీ వ్యూహం మేరకే తొలుత రాజ్యసభ, ఆ తర్వాత లోక్ సభ కశ్మీర్ విభజన బిల్లుకు ఆమోద ముద్ర వేశాయి. లోక్ సభలో రీసౌండింగ్ మెజారిటీతో బిల్లును నెగ్గించుకున్న మోదీ షాలు... ఇక కశ్మీర్ అభివృద్ధిపై దృష్టి సారించినట్టుగానే విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ విశ్లేషణలు నిజమేనన్న రీతిలో గురువారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ లో మాట్లాడిన మోదీ... విభజనతో కశ్మీర్ లో నవయుగం మొదలైపోయిందని ఘనంగా ప్రకటించారు. విభజన తర్వాత కశ్మీర్ ఎలా అభివృద్ధి చెందుతుందన్న విషయంపై ఫుల్ క్లారిటీ ఇస్తూ చేసిన ఈ ప్రసంగం దేశ ప్రజలను మంత్రముగ్దులను చేసిందనే చెప్పాలి.

ఈ ప్రసంగంలో మోదీ ఏమన్నారన్న విషయానికి వస్తే... కశ్మీర్ ను విభజించడం ద్వారా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చామని మోదీ పేర్కొన్నారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో కశ్మీర్ ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. కశ్మీర్ విభజనతో ఆ రాష్ట్రానికి నవయుగం ప్రారంభమైందన్నారు. కశ్మీర్ ప్రజలకు కూడా దేశంలోని ఇతర పౌరులతో సమానంగా హక్కులు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆర్టికల్ 370తో ఒక్కరికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసిన మోదీ... దాని వల్ల అవినీతి, కుటుంబపాలన రాజ్యమేలిందని విమర్శించారు. కశ్మీర్‌లో 45 వేల మంది అమాయకులు చనిపోయారని పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్ విభజనను మోదీ చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. విభజనతో కశ్మీర్ వేగంగా అభివృద్ది చెందుతుందని అభిప్రాయపడ్డారు. జమ్ము కశ్మీర్ విభజనతో కశ్మీరీ ప్రజలు సంతోషంగా ఉన్నారని మోదీ చెప్పుకొచ్చారు.

కశ్మీర్ విభజన తర్వాత అక్కడి ప్రజలకు ఏమేం ప్రయోజనాలు దక్కుతాయన్న విషయాన్ని కూడా ప్రస్తావించిన మోదీ... అక్కడి ప్రజలకు దినసరి కనీస వేతంన అందిస్తామని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వెల్లడించారు. ఇక నుంచి కశ్మీర్‌లో వ్యాపారం మరింత మెరుగవుతుందన్నారు. కశ్మీర్ ప్రజలకు ప్రధానమంత్రి స్కాలర్ షిప్ కూడా అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. జమ్ము కశ్మీర్ విభజన చేసే సమయంలో చాలా ఆలోచించామని చెప్పిన మోదీ... కశ్మీర్ ప్రజల మేలు కోసమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే అన్ని ప్రయోజనాలు కశ్మీర్ ఉద్యోగులకు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్ ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. పర్యాటక రంగం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మోదీ చెప్పారు. మొత్తంగా విభజనతో కశ్మీర్ లో నవయుగం ఆరంభమైనట్టేనని చెప్పిన మోదీ... కశ్మీర్ ను విభజిస్తూ తాము తీసుకున్న నిర్ణయం సబబైనదేనని తేల్చేశారు.