Begin typing your search above and press return to search.

మాకొద్దీ మోదీ దొరతనమూ...!

By:  Tupaki Desk   |   20 March 2018 4:46 PM GMT
మాకొద్దీ మోదీ దొరతనమూ...!
X
నాలుగేళ్ల కిందట జనం నీరాజనం పట్టారాయనకు.. దాంతో దేశ ప్రధానయ్యారు. పార్లమెంటు మెట్లకు వందనం చేసి మరీ అడుగుపెట్టిన ఆయన ఆ తరువాత క్రమంగా తన వినమ్రతను విడిచి తనలోని అహంకారాన్ని బయటకు తీయడం మొదలుపెట్టారు. పాలన చేయాల్సింది పోయి ఏలుబడి మొదలుపెట్టారు. ఇంకేముంది.. నీరాజనం పట్టిన ఆ జనమే ఇప్పుడు వీరావేశం చూపిస్తున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కోపాలకు తోడు అద్వానీ విషయంలో ఆయన వ్యవహరించిన తీరును చూశాక ‘మాకొద్దీ మోదీ దొరతనం’’ అంటూ మండిపడుతున్నారు. ఒకప్పుడు మోదీని భుజాన మోసిన సోషల్ మీడియాలో ఇప్పుడు చూస్తే మోదీ బాగోతాలన్నీ వీడి‌యోలుగా వైరల్ అవుతున్నాయి.. అంతేకాదు... కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పనాజీ నుంచి ఈటా నగర్ వరకు కోట్లాది మంది కోటి కారణాలు చెబుతున్నారు. అవి చూస్తుంటే మోదీని జనం ఇంతగా వ్యతిరేకిస్తున్నారా అని ఆశ్చర్యమేస్తుంది. మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారంతా సోనియాను, రాహుల్‌ను మెచ్చుకోకపోవచ్చు... కమ్యూనిస్టులంటే ఆమడ దూరం ఉండొచ్చు.. చంద్రబాబు వంటి దేశ్ కీ సీనియర్ నేతాను పట్టించుకోకపోవచ్చు... ఫెడరల్ ఫ్రంటు అంటున్న కేసీఆర్‌ను చూసి నవ్వుకోవచ్చు.. మమతా బెనర్జీ, మాయవతి - అఖిలేశ్ - లాలూ - కేజ్రీ - పవార్ - సిద్ధరామయ్య... ఇలా అందరినీ లైట్‌ గా తీస్కోవచ్చు. మోదీ వ్యతిరేకుల్లో చాలామందికి వీరిలో ఎవరిపైనా ఇష్టం లేకపోవచ్చు. కానీ.. మోదీని కాదనుకోవడంలో మాత్రం దేశ ప్రజలు చాలా సీరియస్‌ గా ఉన్నారు.
    
ఇంతకీ మోదీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నది చూస్తే వందలాది కారణాలు చెప్తున్నారు. ప్రపంచ దేశాలను కుదిపేసిన మాంద్యాన్ని సైతం తట్టుకుని నిలబడిన మన సుస్థిర ఆర్థిక వ్యవస్థను నోట్ల రద్దుతో రోడ్డున పడేసిన ఆయన్ను అప్పట్లో సమర్ధించినా ఇప్పుడు గుర్తుచేసుకుని మరీ తిడుతున్నారు. మతం పేరిట దేశం రెండుగా చీలడానికి కూడా మోదీ కారణమయ్యారన్నది మరో ఆరోపణ.
    
పేదలకు చేసిందేమీ లేకపోగా బడా బాబులకు దేశాన్ని దోచిపెట్టడం.. బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయినవారిని ఏమీ చేయలేకపోవడం.. నల్లధనం వెనక్కు తెస్తానని, ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో డబ్బు పడేలా చేస్తానని చెప్పి మాట నిలుపుకోలేకపోవడం..  ఒకప్పుడు ఆధార్‌ను వ్యతిరేకించి ఇప్పుడు అదే ఆధార్‌ను ప్రతి దానికీ లింకుపెట్టి జనం వ్యక్తిగత సమాచారంతో ఆడుకోవడం వంటి కారణాలను చెబుతున్నారు.
    
ముద్ర రుణాలు, ప్రతి ఒక్కరికీ ఇల్లు, మేకిన్ ఇండియా వంటి పేరు గొప్ప పథకాలు ఎన్నో ప్రకటించినా ఎంతమందికి రుణాలు దక్కాయి.. ఎంత మంది పేదలకు ఇల్లు కట్టారు.. ఎన్ని రకాల వస్తువులు ఇండియాలో తయారు చేశారన్న ప్రశ్నలు వేస్తున్నారు. అంతేకాదు.. మోదీ స్వయంగా ప్లాన్ చేసి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భారీ సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని కూడా చైనాలో తయారుచేయిస్తుండడం వంటివీ జనాలకు తెలియనివి కావు. దీంతో మరి మేకిన్ ఇండియా ఇంకెక్కడ? అన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రపంచమంతా పెట్రోలు రేట్లు తగ్గినా భారత్‌లో మాత్రం పైపైకి ఎగబాకడం వాహనమున్న ప్రతి భారతీయుడికీ కోపం తెప్పిస్తోంది. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి జనానికి పనిలేకుండా చేయడంతో నిరుపేద కూలీల కళ్లలోనూ కోపం కనిపిస్తోంది.
    
అంతేకాదు... కశ్మీర్ రావణకాష్టం మరింత రగులు కోవడం  ఆ ప్రాంత ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిలిస్తోంది. ఈశాన్య రాష్ర్టాల్లో అధికార కాంక్షతో చేస్తున్న రాజకీయం.. ఉత్తరాదిన వికటించిన రాష్ర్టపతి పాలనల మాయాజాలం... బిహార్లో అధికారం హస్తగతం చేసుకున్న తీరు.. గోవాలో అధికారంలోకి వచ్చిన విధానం.. తమిళనాడులో జయలలిత మరణ సమయం నుంచి ఆ తరువాత వరకు మోదీ కనుసన్నల్లోని బీజేపీ పాత్ర.. మహారాష్ర్టలో చిరకాల మిత్రుడు శివసేనకు సైతం మండేలా వ్యవహరించడం.. ఏపీకి మట్టినీళ్లిచ్చి మోసం చేయడం వంటివన్నీ ఆ ప్రాంత ప్రజల్లో మోదీ అంటే రగిలిపోయేలా చేస్తున్నాయి.
    
అందుకే మోదీ తప్ప ఇంకెవరు ప్రధాని అయినా ఫర్వాలేదన్నట్లుగా జనం సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినా ఫర్వాలేదు, మోదీ మాత్రం ప్రధానిగా వద్దంటున్నారు జనం. 2019 వరకు ఆగలేమని.. మోదీ ఇన్నాళ్లూ కోరుకుంటున్నట్లుగా ముందస్తు ఎన్నికలు పెడితే ముందుగానే దించేస్తామంటున్నారు కూడా.