Begin typing your search above and press return to search.

ఆ దేశ త‌దుప‌రి ప్ర‌ధాని భార‌త సంత‌తి గే

By:  Tupaki Desk   |   3 Jun 2017 5:50 AM GMT
ఆ దేశ త‌దుప‌రి ప్ర‌ధాని భార‌త సంత‌తి గే
X
ఎన్నాళ్లు ఉన్నా స‌రే.. నువ్వు మాలో ఒక‌డివి కాలేవు అన్న‌ట్లుగా ఉంటుంది కొన్ని ప్రాంతాల‌ వారి మాట‌. అందుకు తాజా నిద‌ర్శ‌నం త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ విష‌యంలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. పుట్టింది మ‌హారాష్ట్రలో క‌న్న‌డిగ కుటుంబంలో అయినా.. ద‌శాబ్దాల నుంచి త‌మిళుల శ్వాసే త‌న శ్వాస‌గా ఆయ‌న త‌పిస్తుంటారు.

త‌మిళ సినిమా మీద చెర‌గ‌ని ముద్ర వేసిన ఆయ‌న ఇమేజ్ ను త‌మిళోడు త‌మ‌దిగా ఫీల‌వుతుంటారు. త‌మవాడిగా ఆయ‌న్ను అభిమానిస్తారు.. ఆరాధిస్తారు.. అంత‌కు మించి పూజిస్తారు త‌మిళులు. కానీ.. అదే వ్య‌క్తి రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌న్న వెంట‌నే ర‌జ‌నీలోని త‌మిళేత‌రుడు క‌నిపిస్తాడు. నిన్నటివ‌ర‌కూ దేవుడిగా పూజించిన ర‌జ‌నీని.. భార‌తీరాజా లాంటి ద‌ర్శ‌క దిగ్గ‌జం సైతం.. నాకు పిల్ల‌లు పుట్ట‌నంత మాత్రాన.. నా బెడ్‌ ను షేర్ చేస్తానా? అంటూ ఊహించ‌లేని మాట‌ల్ని మాట్లాడేస్తుంటారు. ఇలాంటివి విన్న‌ప్పుడు ఇంత కాలం త‌న‌ను అభిమానించిన ప్ర‌జ‌లు ఇంత‌లా త‌న‌ను అంటారా? అని ర‌జ‌నీలాంటోళ్లు ఫీల్ అయిపోతారేమో.

కానీ.. ప్రాంతాల్ని చూపించి మ‌నుషుల్ని మ‌నోళ్లు కాదు.. ప‌రాయి వాళ్లు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే తీరు ఏమాత్రం స‌రికాద‌న్న విష‌యాన్ని చేత‌ల్లో చేసి చూపించారు ఐర్లండ్ ప్ర‌జ‌లు. ఎందుకంటే.. ఇప్పుడా దేశ ప్ర‌ధానిగా ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న వ్య‌క్తి.. భార‌త సంత‌తికి చెందిన వ్య‌క్తి కావ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుత ప్ర‌ధాని ఎండా కెన్నీ రాజీనామా చేయ‌టం.. ఆయ‌న నేతృత్వం వ‌హిస్తున్న అధికార పార్టీలో జ‌రిగిన అంత‌ర్గ‌త ఎన్నిక‌ల్లో భార‌త సంత‌తికి చెందిన లియో వార‌డ్క‌ర్‌కు 60 శాతం ఓట్లను సొంతం చేసుకోవ‌టంతో.. ఐర్లాండ్ తదుప‌రి ప్ర‌ధానిగా మ‌నోడు ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నారు.

నిజానికి 38 ఏళ్ల లియో వార‌డ్క‌ర్ కు ప్ర‌ధాని అయ్యేందుకు ఉండాల్సిన చాలా ల‌క్ష‌ణాలు లేవ‌నే చెప్పాలి. మ‌నోళ్ల మైండ్ సెట్ ప్ర‌కారం.. ఆయ‌న్ను ప్ర‌ధానిగా అంగీక‌రించే ఛాన్సే లేదు. ఎందుకంటే.. ఆయ‌న స‌గం భార‌తీయుడు. పొలిటీషియ‌న్ కంటే కూడా వైద్యుడిగానే బాగా పేరుంది. అన్నింటికి మించిన ఆయ‌న గే (అదేనండి.. స్వ‌లింగ సంప‌ర్కుడు). మ‌రి.. ఇలాంటి వ్య‌క్తి దేశ ప్ర‌ధానిగా ప‌గ్గాలు చేప‌ట్ట‌టం అంత తేలిక ఏమాత్రం కాదు. కానీ.. ఆయ‌న్ను ప్ర‌ధానిగా ఎంపిక చేస్తూ ఫైన్ గేల్ పార్టీ డిసైడ్ చేసింది.

దీంతో ఆయ‌న జూన్ 13న జ‌రిగే పార్ల‌మెంటు స‌మావేశాల్లో అధికారికంగా ప‌గ్గాలు అందుకోనున్నారు. ఇంత‌కీ.. వార‌డ్క‌ర్ బ్యాక్ గ్రౌండ్లోకి వెళితే.. ముంబ‌యి నుంచి వెళ్లి స్థిర‌ప‌డ్డ హిందూ.. మ‌హారాష్ట్రీయుడైన డాక్ట‌ర్ అశోక్ వార‌డ్క‌ర్‌.. ఐరిష్ న‌ర్స్ మీరియ‌మ్ మూడో సంతాన‌మే లియో. 66 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న ఒక చిన్న దేశంలో ఆసియా మూలాలున్న‌.. గే ను ఎన్నుకోవ‌టం ఊహ‌కు అంద‌ని విష‌యంగా చెప్పాలి. లియోకి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. మొద‌ట ఆయ‌న లా కోర్సు చేరి.. త‌ర్వాత మెడిసిన్ కోర్సు చేశారు. డాక్ట‌ర్ కోర్సు పూర్తి చేసిన ఏడాదే రాజ‌కీయాల్లో ఆయ‌న ప్ర‌యాణం షురూ కావ‌ట‌మే కాదు.. తాజాగా ప్ర‌ధానిగా ప‌గ్గాలు అందుకోవటం పెను సంచ‌ల‌నంగా మారింది. మ‌నోడు ఒక దేశానికి ప్ర‌ధాని కావ‌టం చూసిన‌ప్పుడు.. ప్రాంతాల గోడ‌ల్ని క‌ట్టుకోవ‌టం స‌బ‌బేనా? అన్న సందేహం రావ‌టం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/