Begin typing your search above and press return to search.

దుబాయ్ లో తెలుగోడికి అంత పెద్ద లాట‌రీ త‌గిలింది

By:  Tupaki Desk   |   7 Aug 2017 4:32 AM GMT
దుబాయ్ లో తెలుగోడికి అంత పెద్ద లాట‌రీ త‌గిలింది
X
దుబాయ్‌లోని తెలుగోడికి సుడి తిరిగిపోయింది. పొట్ట చేత‌బెట్టుకొని దుబాయ్ వెళ్లి.. భ‌వ‌న నిర్మాణంలో చిరుద్యోగిగా బండి లాగిస్తున్న తెలుగోడు కృష్ణంరాజు క‌థ సినిమాను త‌ల‌పించేలా ఉంద‌న‌టంలో సందేహం లేదు. ఉపాధి కోసం దేశం కాని దేశం వెళ్లినా.. బ‌తుకుబండి మార‌క‌పోగా.. అప్పుల మీద అప్పులు చేస్తున్న దుస్థితి.

ఇలాంటి వేళ‌లో అత‌గాడికి బిగ్ 5 టికెట్ డే లాట‌రీ తాజా డ్రాలో విజేత‌గా నిలిచాడు. దీంతో.. అత‌నికి ఏకంగా రూ.8కోట్లు ప్రైజ్ మ‌నీగా రానున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ లాట‌రీ కంపెనీ నుంచి వ‌చ్చింది. ఇంత పెద్ద మొత్తాన్ని గెలుచుకున్నాన‌న్న ఫోన్ రావ‌టంతో కృష్ణంరాజు నోట మాట రావ‌టం లేదు.

అంతంత‌మాత్రం సంపాద‌న‌తో అప్పుల్లో మునిగిపోయిన అత‌గాడిని ల‌క్ష్మీదేవి క‌రుణించి రావ‌టంపై సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. త‌న‌కు మొద‌టి నుంచి లాట‌రీలు కొన‌టం అల‌వాట‌ని.. అప్పుల్లో కూరుకుపోయిన వేళ‌లోనూ తాను లాట‌రీ టికెట్ కొనేవాడిన‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ స్నేహితుల‌తో క‌లిసి.. వాటాలు వేసుకొని లాట‌రీ టికెట్లు కొనేవాడిన‌ని.. కానీ.. ఇప్పుడు త‌గిలిన లాట‌రీ టికెట్‌ను మాత్రం తాను ఒక్క‌డినే కొనుగోలు చేసిన‌ట్లుగా వెల్ల‌డించాడు.

2008లో యూఏఈకి వ‌చ్చిన ఈ తెలుగోడి జీవితంలో క‌ష్టాలు.. క‌న్నీళ్లు త‌ప్పించి మ‌రింకేమీ క‌నిపించ‌వు. తాజాగా త‌గిలిన లాట‌రీతో మ‌నోడి జీవిత‌మే మారిపోయింది. భారీ మొత్తంలో వచ్చే ప్రైజ్ మ‌నీ గురించి త‌ల్లికి ఫోన్ చేసి చెప్పిన కృష్ణంరాజు.. వ‌చ్చే డ‌బ్బుల్లో కొంత‌భాగాన్ని త‌న నాలుగేళ్ల కొడుకు చ‌దువు కోసం కేటాయిస్తాన‌ని.. త‌న‌కున్న అప్పుల‌న్నీ తీర్చేస్తాన‌ని చెబుతున్నాడు.