Begin typing your search above and press return to search.

హెచ్‌1బీ వీసాలు ఇవ్వ‌ద్దంటున్న ఇన్ఫో మూర్తి

By:  Tupaki Desk   |   3 Feb 2017 4:13 AM GMT
హెచ్‌1బీ వీసాలు ఇవ్వ‌ద్దంటున్న ఇన్ఫో మూర్తి
X
దేశీయ ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన డిమాండ్ చేశారు. విదేశీ ఉద్యోగుల ప్రవాహాన్ని నియంత్రించేందుకు అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్‌1బీ వీసాల‌కు క‌త్తెర వేసేందుకు వేగంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో నారాయ‌ణ మూర్తి మీడియాతో మాట్లాడారు. భారత ఐటీ కంపెనీలు హెచ్1బీ వీసాలపై ఇక్కడివారిని అమెరికాకు పంపడాన్ని ఆపేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికా సంస్థ‌లు కూడా స్థానికుల‌ను మాత్ర‌మే తీసుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ట్రంప్ ప్ర‌తిపాద‌న‌ల నేప‌థ్యంలో నారాయ‌ణ‌మూర్తి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నారాయ‌ణ‌మూర్తి ఒకింత విస్మ‌య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. "తేలిక‌గా ప‌ని పూర్త‌య్య‌ సులభమైన మార్గాన్ని అనుసరించడమే భారతీయ మనస్తత్వంగా ఉంటోంది. బహుళ సంస్కృతికి ఎదగడం చాలా చాలా కష్టమైన మార్గమే. హెచ్‌1బీ వీసాల విష‌యంలో ప్ర‌తిపాదిత మార్పులు రావ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. కానీ అమెరికా త‌నకు న‌చ్చిన‌ట్లుగా అమెరిక‌న్ల‌నే ఉద్యోగం లోకి తీసుకోవాలి. అంతేకాదు....కెనడాలో కెనడియన్లను, బ్రిటన్‌ లో బ్రిటిష్ ప్రజలనే ఎంపిక చేసుకోవాలి" అని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉండ‌గా...ప్రత్యేకమైన విభాగాల్లో సిద్ధాంతపరమైన, సాంకేతికపరమైన నిపుణత అవసరమైన రంగాల్లో ఉన్నత విద్యావంతులైన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అనుమతించే నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాను హెచ్-1బీ గా పిలుస్తారు. సైంటిస్టులు - ఇంజినీర్లు లేదా కంప్యూటర్ ప్రోగ్రామర్లు వంటి వృత్తి నిపుణులు సాధారణంగా ఈ క్యాటగిరీలోకి వస్తారు. ప్రతి యేటా 65వేల హెచ్-1బీ వీసాలను అమెరికా ఇస్తుంటుంది. ప్రస్తుతం అమెరికాలోని ఇన్ఫోసిస్‌ లో పని చేస్తున్నవారిలో 60శాతానికిపైగా హెచ్-1బీ వీసాదారులే. ఈ నేపథ్యంలో తాను అధికారంలోకి వస్తే ఈ వీసాల ప్రక్రియను కఠినతరం చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి శరణార్థులు, వలసవాదుల రాకను కొత్త అధ్యక్షుడు ట్రంప్ నిషేధించడాన్ని మాజీ అధ్యక్షుడు ఒబామా వ్యతిరేకించారు. మ‌రోవైపు...అమెరికాలో వలసదారుల నిర్బంధం కొనసాగుతున్నది. తాజాగా ఓ ఐదేళ్ల‌ బాలుడిని అధికారులు విమానాశ్రయంలో నిలిపివేశారు. అమెరికాలోని మేరీల్యాండ్ వాసి ఇరాన్ మహిళను పెళ్లాడారు. వీరికి ఐదేండ్ల బాబు ఉన్నాడు. ఆ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వస్తున్నప్పుడు డల్లాస్ విమానాశ్రయ అధికారులు నిర్బంధించారు. దాదాపు 4 గంటల తర్వాత వదిలేయడంతో ఆ బాబును తల్లి కలుసుకున్న భావోద్వేగ దృశ్యం స్థానిక మీడియాలో ప్రసారమైంది. కాగా ఈ ప‌రిణామంపై వైట్‌ హౌస్ కార్యదర్శి సీయన్ స్పైపర్ స్పందించారు. సురక్షిత చర్యల్లో భాగంగా ప‌టిష్ట‌మైన‌ తనిఖీలు చేస్తున్నామని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/