Begin typing your search above and press return to search.

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ బుక్ చేసుకోవటంలో మోడీ సర్కారు లేట్?

By:  Tupaki Desk   |   22 July 2020 1:30 AM GMT
ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ బుక్ చేసుకోవటంలో మోడీ సర్కారు లేట్?
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దూకుడుకు కళ్లాలు వేసేందుకు వివిధ సంస్థలు ప్రయోగాలు మీద ప్రయోగాలు చేస్తున్నాయి. వందకు పైగా సంస్థలు ప్రయోగాలు చేస్తున్నా.. ప్రపంచం ఫోకస్ మొత్తం నాలుగైదు ప్రయోగాల మీదనే ఉంది. అందులో టాప్ లో బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ వర్సిటీ - ఆస్ట్రాజెనికా ఆధ్వర్యంలో రూపొందిస్తున్న వ్యాక్సిన్ మీదనే అందరి గురి ఉంది.

తాజాగా ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ నివేదిక ప్రకారం ఆక్స్ ఫర్డ్ వర్సిటీ రూపొందించిన వ్యాక్సిన్ తొలి రెండు దశల్లో నిర్వహించిన హ్యుమన్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి అయినట్లు పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలు మినహా.. మొత్తంగా మంచి ఫలితాలు వచ్చినట్లు సదరు జర్నల్ వెల్లడించటం తెలిసిందే. రానున్న రోజుల్లో మిగిలిన దశల్ని పూర్తి చేస్తే.. అందరికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఈ ఏడాది చివరకు మాత్రమే వస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

ఆక్స్ ఫర్డ్ వర్సిటీ తయారు చేస్తున్న వ్యాక్సిన్ కు పలు దేశాలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చేస్తున్నాయి. బ్రిటన్ విషయానికి వస్తే.. ఆ దేశం ఏకంగా 9 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చేసింది. ఇదే తరహా పలు దేశాలు ఆడ్వాన్సుగా వ్యాక్సిన్ ఆర్డర్లు ఇచ్చేస్తున్నాయి. మరి.. ప్రపంచంలోని పలు దేశాలతో భారత్ పోటీ పడుతుందా? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. వ్యాక్సిన్ తయారయ్యాక తొలుత తయారు చేసిన వ్యాక్సిన్లను తొలుత బుక్ చేసుకున్న దేశాలకు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంటుంది.

మొదట్లో పెద్ద ఎత్తున ఆర్డర్లను డెలివరీ చేయాల్సి ఉంటుంది కాబట్టి.. ముందుగా ఒప్పందం చేసుకున్న వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే.. మన దేశానికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందన్నది ప్రశ్న. మిగిలిన దేశాల ప్రభుత్వాల మాదిరి మోడీ సర్కారు సైతం వ్యాక్సిన్ కు భారీ ఆర్డర్ ఇవ్వటమో.. ఒప్పందం చేసుకోవటం మంచిదంటున్నారు.

మిగిలిన వారి మాదిరి ముందుచూపు లేకపోతే.. రెండు.. మూడు నెలల ఆలస్యంగా దేశానికి వ్యాక్సిన్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే ఆక్స్ ఫర్డ్ వర్సిటీ భారత్ లో సీరమ్ ఇనిస్టిట్యూట్ తో ఒప్పందం చేసుకుంది. తాము వ్యాక్సిన్ తయారు చేసినంతనే..ఈ సంస్థ చేత పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించనున్నారు. అలా చేయించిన దానిని భారత్ లో విడుదల చేసే వీలుందని చెబుతున్నా.. అదేమంత తేలిక కాదన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. మిగిలిన దేశాలు ముందే ఆర్డర్లు పెట్టుకున్నప్పుడు ఎంత మన దేశంలో వ్యాక్సిన్ తయారు చేసినా.. పంపించాల్సింది మాత్రం ఆర్డర్లు పెట్టుకున్న దేశాలకేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్న సంస్థల్లో మేలైన కంపెనీని ఎంపిక చేసుకొని ముందే ఒప్పందం చేసుకోవటం మంచిదన్న మాట వినిపిస్తోంది.