Begin typing your search above and press return to search.

అధ్యక్షుడు మనోడైతే... కోచ్ పదవి!

By:  Tupaki Desk   |   12 April 2015 1:38 PM IST
అధ్యక్షుడు మనోడైతే... కోచ్ పదవి!
X
నాలుగేళ్లు కోచ్ పదవిలో ఉన్న డంకన్ ఫ్లెచర్ కాంట్రాక్టు మరికొన్ని రోజుల్లో ముగియనుండటంతో.... ఫ్లెచర్ వారసుడెవరు అనే దానిపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. నిన్నటివరకూ టీం ఇండియా కోచ్ ఎవరంటే... ముందుగా సచిన్ టెండుల్కర్ పేరు వినిపించినా... మారిన పరిస్థితుల దృష్ట్యా, బీసీసీఐ బోర్డులో మార్పుల దృష్ట్యా ఈ సారి టీం ఇండియా కోచ్ పదవి బెంగాల్ టైగర్ సౌరభ్ గంగూలీకి దక్కనుందా అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. భారత క్రికెట్ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడు, బ్యాటింగ్ లో ఒకప్పుడు టీం ఇండియా తరుపున దూకుడుగా ఆడగలిగనవారిలో ప్రముఖుడు, ప్రత్యర్థి స్పిన్నర్లకు చెమటలు పట్టించగల దూకుడు, సంయమనం - ఆవేశం కలగలిపిన కెప్టెన్సీ కి గంగూలీ పేరు చెప్పుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే... బిసీసీఐ అధ్యక్షుడిగా దాల్మియా ఉండటమూ ప్రధాన కారణంగా కూడా చెప్పొచ్చు.
తాజాగా ఈసారి భారతీయుడే కోచ్ గా ఉండాలనే వాదన తెరపైకి రావడంతో ఈ సారి అవకాశం అన్ని రకాలుగానూ పుష్కలంగా ఉన్న గంగూలీకే దక్కవచ్చనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే తనకు టీం ఇండియా కోచ్ కావాలని ఉందని గంగూలీ చాలా సార్లు తన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నాడట. ఇప్పుడు కూడా గంగూలీ అదే ఆలోచనతో ఉంటే... కోచ్ గా ఎంపిక కావడం పెద్ద విషయమేమీ కాదనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ ముగిశాక జరిగే సిరీస్ ల సమయానికి ఈ కొత్త కోచ్ నియామకం జరిగే అవకాశాలున్నాయి.
బౌలింగే ప్రధాన బలహీనత అని చెప్పుకునే టీం ఇండియాలో బౌలర్లలో గొప్ప మార్పు తీసుకొచ్చి, ప్రపంచ కప్ లో ఉత్తమ బౌలింగ్ దిశగా కోచింగ్ ఇచ్చిన భారత జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ను ప్రధాన కోచ్ గా నియమిస్తే మంచిదని టీం డైరెక్టర్ రవిశాస్త్రి పట్టుబడుతున్నట్లు సమాచారం! అయితే ఒక సారి దాల్మియా నిర్ణయించేసుకున్నాక, గంగూలీ కావాలనుకున్నాక, రవిశాస్త్రి ప్రభావం పెద్దగా పనిచేయకపోవచ్చని క్రీడా పండితుల అభిప్రాయం. ఇదే జరిగితే టీంఇండియాలో పెనుమార్పులు జరిగే అవకాశం ఉంటుంది. గంగూలీ కోచ్ పదవికి ఎంపికైతే... యువరాజ్, గంభీర్, సెహ్వాగ్ లకు మంచిరోజులు రావొచ్చనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తపరుస్తున్నారు!