Begin typing your search above and press return to search.

సారీ ఆస్ట్రేలియా.. ప్లకార్డులతో ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   12 Oct 2017 3:36 PM IST
సారీ ఆస్ట్రేలియా.. ప్లకార్డులతో ఫ్యాన్స్
X
క్రికెట్ ను మతంగా భావించే ఇండియాలో అభిమానులు మంచి క్రీడా స్ఫూర్తి ప్రదర్శిస్తారన్న గుర్తింపు ఉంది. స్టేడియంలో చాలా హుందాగా ప్రవర్తిస్తారని.. ప్రత్యర్థుల్ని ఎంతో గౌరవంగా.. ప్రేమగా చూస్తారని పేరుంది. అందులోనూ ఐపీఎల్ వచ్చాక వేరే దేశాల ఆటగాళ్లను ప్రత్యర్థులుగా చూడటం పోయంది. అందరి ఆటనూ ఆస్వాదించడం.. అందరినీ అభిమానించడం మన అభిమానులకు అలవాటైంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్-ఆస్ట్రేలియా రెండో టీ20 అనంతరం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గౌహతిలో మ్యాచ్ అయ్యాక ఆస్ట్రేలియా జట్టు వెళ్తున్న బస్సుపై ఎవరో రాయి విసిరారు. అద్దం పగిలింది. అదృష్టం కొద్దీ ఎవరికీ గాయాలవ్వలేదు. ఐతే ఈ ఘటన ఆస్ట్రేలియా జట్టులో ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటనను అస్సాం ముఖ్యమంత్రి సోనవాల్ కూడా తీవ్రంగా ఖండించాడు.

ఈ ఘటన తమకు ఆందోళన కలిగించినప్పటికీ భారత అభిమానుల్ని తప్పుగా అర్థం చేసుకోలేదని అంటున్నారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. ఎవరో ఒక అభిమాని చేసిన తప్పుడు పనికి అందరికీ చెడ్డ పేరు వస్తోందన్నాడు ఆ జట్టు స్పిన్నర్ ఆడమ్ జంపా. రాయి పడ్డపుడు తాను సమీపంలోనే హెడ్ ఫోన్స్‌లో పాటలు వింటూ ఉన్నానన్నాడు జంపా. శబ్దం వచ్చిందని చూస్తే... రాయి కనిపించిందన్నాడు. ఈ ఘటనతో భయపడ్డ మాట వాస్తవమే అని చెప్పాడు. కానీ భారత అభిమానులు మంచి వాళ్లని.. వాళ్ల తమను ఎంతగానో ప్రేమిస్తారని చెప్పాడు జంపా. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ.. గౌహతిలోనే పలుచోట్ల అభిమానులు ప్లకార్డులు పట్టుకున్నారు. వాటి మీద ‘సారీ ఆస్ట్రేలియా’ అని రాసి ఉండటం విశేషం. మొత్తానికి ఎవరో ఓ తుంటరి అభిమాని చేసిన పనికి భారత ఫ్యాన్స్ అందరికీ చెడ్డపేరు వచ్చిన నేపథ్యంలో ఇలా ప్లకార్డులు పట్టుకుని పలువురు అభిమానులు నిలుచోవడం గొప్ప విషయమే.