Begin typing your search above and press return to search.

త‌గ్గుతున్న డాల‌ర్ డ్రీమ్స్..హెచ్‌1బీకి ద‌ర‌ఖాస్తులే నిద‌ర్శ‌నం

By:  Tupaki Desk   |   4 April 2018 4:49 AM GMT
త‌గ్గుతున్న డాల‌ర్ డ్రీమ్స్..హెచ్‌1బీకి ద‌ర‌ఖాస్తులే నిద‌ర్శ‌నం
X
అగ్ర‌రాజ్యం - అవ‌కాశాల స్వ‌ర్గం అనే పేరున్న అమెరికాపై మ‌నోళ్ల అనాస‌క్తి మొద‌లైంది. అమెరికా ప్రభుత్వం 2019లో హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియను నిర్వహించే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్‌ సీఐఎస్) సంస్థ సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే హెచ్-1బీ వీసా జారీకి కఠిన నిబంధనలు అమలు చేస్తుండటంతో భారతీయ కంపెనీలు - కన్సల్టెన్సీలు వీసా దరఖాస్తులను తగ్గించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పలు అమెరికా పత్రికలు ప్రస్తావించడం గ‌మ‌నార్హం. ట్రంప్ ప్రభుత్వ చర్యలతో భారత్ సహా పలు దేశాల నిపుణులు హెచ్-1బీ వీసాలు పొందేందుకు ఇష్టపడటం లేదని సిలికాన్ వ్యాలీ పత్రిక పేర్కొంది. కొన్నేళ్లుగా వీసాల జారీ కఠినతరంతో కంపెనీలు - ఉద్యోగులు నష్టపోతున్నారని శాన్‌ ఫ్రాన్సిస్కో క్రానికల్ అభిప్రాయపడింది. ట్రంప్ ప్రభుత్వం అమెరికా వలస విధానాలకు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్నదని ద డైలీ వెల్లడించింది.

అమెరికా కంపెనీలు ప్రత్యేక వృత్తు ల్లో నిపుణులైన విదేశీ సిబ్బంది నియామకానికి హెచ్1బీ వీసా వీలు కల్పిస్తుంది. ఏటా 65వేల వీసాలను మాత్రమే మంజూరు చేస్తుంటారు. ఈ వీసాలకు ప్రపంచ దేశాల్లో విపరీత డిమాండ్ ఉంది. ముఖ్యంగా భారత్, చైనాల నిపుణులు ఈ వీసాలతో అధికంగా లాభపడుతున్నారు. దీంతో ఏటా వేలాది మంది అమెరికాకు వలస వెళ్తున్నారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలతో కొన్నాళ్లుగా దరఖాస్తుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. యూఎస్‌ సీఐఎస్ మొదటి 20వేల దరఖాస్తుల్లో యూఎస్ మాస్టర్ డిగ్రీ లేదా అంతకన్నా ఎక్కువ అర్హత ఉన్నవారికి వీసాల వార్షిక పరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది. వీసాల జారీ నిబంధనలను ఇటీవలే ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తామని - చిన్న తప్పు దొర్లినా సహించేది లేదని యూఎస్‌ సీఐఎస్ స్పష్టం చేసింది. వార్షిక పరిమితికి మించి దరఖాస్తులు వస్తే ఎలా ఎంపిక చేస్తారో మాత్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. ఆరేళ్లుగా పరిమితికి మించి దరఖాస్తులు వస్తే కంప్యూటరైజ్డ్ లాటరీ తీస్తుండ‌గా ప్ర‌స్తుత సంవ‌త్స‌ర విధానం ఇంకా వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలాఉండ‌గా...హెచ్-1బీ వీసాలకు డిమాండ్ తగ్గుతోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. దీంతో టెక్నాలజీ రంగంలోని దాదాపు 5.48 లక్షల ఉద్యోగాల విషయంలో కంపెనీలు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయంది. కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడం అమెరికన్లకు - అమెరికా కంపెనీలకు ఎంతో లాభదాయకమని ద డైలీ ప‌త్రిక పేర్కొంది. విదేశీ నిపుణులు రావడంతో పోటీ పెరుగుతుందని, స్థానికులు తమ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటారని, ఫలితంగా ఉత్పత్తి పెరుగుతుందని వివరించింది. ఇమ్మిగ్రేషన్ విధానంలో అనిశ్చితితో కంపెనీల్లోని 26% మంది ఉద్యోగులు తమ ప్రాజెక్టులను ఆలస్యంగా పూర్తి చేస్తున్నట్టు తమ సర్వేలో తేలిందని ఎన్వాయ్ గ్లోబల్ అనే ఇమ్మిగ్రేషన్ సర్వీస్ ప్రొవైడర్ పేర్కొంది. 22 % మంది ఉద్యోగులు అమెరికా కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపింది. హెచ్-1బీ వీసాకు సంబంధించి ఇంటర్నెట్‌ లో వెతికేవారి సంఖ్య 2017 నుంచి క్రమంగా తగ్గుతున్నదని ఇండీడ్.కామ్ సంస్థ తెలిపింది.