Begin typing your search above and press return to search.

లద్దాఖ్ లో భారత.. చైనా సైనికుల మధ్య ఘర్షణ

By:  Tupaki Desk   |   12 Sept 2019 1:11 PM IST
లద్దాఖ్ లో భారత.. చైనా సైనికుల మధ్య ఘర్షణ
X
పొగరమోతు చైనా మరోసారి తన పొగరమోతుతనాన్ని ప్రదర్శించింది. సరిహద్దుల వద్ద డ్రాగన్ దేశానికి చెందిన సైనికులు ముఖాముఖిన ఘర్షణకు దిగిన వైనం కొత్త ఉద్రిక్తతకు తెర తీసింది. లద్దాఖ్ లోని సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకున్నఈ ఉదంతం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని పెంచినా.. బిగ్రేడియర్ స్థాయి అధికారులు జరిపిన చర్చలతో పరిస్థితి యథాతధ స్థితికి చేరుకున్నట్లు చెబుతున్నారు.

లద్దాఖ్ లోని ఉత్తర ప్యాంగాంగ్ సరస్సు 134 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో మూడొంతుల ప్రాంతాన్ని చైనా అధీనంలో ఉంది. ఈ సరస్సు వద్ద భారత సైన్యం నిన్న (బుధవారం ఉదయం) గస్తీ నిర్వహిస్తోంది. ఇదే సమయంలో చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు అక్కడికి వచ్చి భారత సైనికులతో గొడవ పడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల వారు ముఖాముఖిన తలపడటమే కాదు.. బాహాబాహికి దిగారు.

దీంతో.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరగటమే కాదు.. రెండు దేశాల సైనికులు తమ సైన్యాన్ని మొహరించారు. సరస్సు దగ్గర భారత సైన్యం గస్తీ కాయటంపై చైనా సైన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మొదలైన రచ్చ సాయంత్రం వరకూ సాగుతూనే ఉంది.

ప్రోటోకాల్ ప్రకారం సాయంత్రం ఇరు దేశాలకు చెందిన బ్రిగేడియర్ స్థాయి అధికారులు చర్చలు జరిపారు. దీంతో.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తెర పడినట్లైంది. రెండేళ్ల క్రితం కూడా ఇదే ప్రాంతంలో రెండు దేశాల సైనికులు కర్రలతో కొట్టుకోవటం గమనార్హం. మొత్తంగా ఈ ఇష్యూ ఇప్పటికైతే ఒక కొలిక్కి వచ్చిందని చెప్పక తప్పదు.