Begin typing your search above and press return to search.

డాషింగ్ బ్యాట్స్ మన్.. డిపెండబుల్ కోచ్.. ఓ అనూహ్య ప్రశ్న

By:  Tupaki Desk   |   8 Jan 2023 12:30 PM GMT
డాషింగ్ బ్యాట్స్ మన్.. డిపెండబుల్ కోచ్.. ఓ అనూహ్య ప్రశ్న
X
భారత క్రికెట్ లో ప్రస్తుతం మార్మోగుతున్న పేరు సూర్యకుమార్ యాదవ్. శ్రీలంకతో శనివారం జరిగిన మూడో టి20లో అతడి బ్యాటింగ్ చూసి నోరెళ్లబెట్టనివారు లేరు. ఆ షాట్లేమిటి..? ఆ దూకుడేమిటి..? బంతిని ఎంత లాఘవంగా కొట్టాడో అంతే లాఘవంగా కట్ చేశాడు. నెమ్మదిగా ప్రారంభించి సునామీలా మారాడు. కేవలం 45 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. టీమిండియా తరఫున రోహిత్ శర్మ (35) తర్వాత తక్కువ బంతుల్లో టి20 సెంచరీ చేసింది సూర్యనే కావడం విశేషం. ఈ క్రమంలో 2016లో వెస్టిండీస్ టూర్ లో 46 బంతుల్లో కేఎల్ రాహుల్ చేసిన సెంచరీ రికార్డును అధిగమించాడు. కాగా, టి20ల్లో సూర్యకిది మూడో సెంచరీ.

రెండేళ్లలోనే మూడు

సూర్యకుమార్ టి20 అరంగేట్రం చేసి అటుఇటుగా రెండేళ్లు అవుతోంది. మహా అయితే మూడేళ్లలోపే. ఈ వ్యవధిలోనే అతడు మూడు టి20 సెంచరీలు కొట్టాడు. 2007 నుంచి టి20 కెరీర్ ఉన్న, ఓపెనర్ గా వచ్చే రోహిత్ శర్మ 15 ఏళ్లలో నాలుగు సెంచరీలు కొడితే.. సూర్య రెండేళ్లలోనే మూడు సెంచరీలు బాదాడు. దీన్నిబట్టే అతడి ఆటతీరు..

ముఖ్యంగా టి20ల్లో సూర్య సత్తా ఏమిటో తెలిసిపోతోంది. కాగా, టి20ల్లో సూర్య స్ట్రయిక్ రేట్ 180 పైనే. టీమిండియాలో మరెవరికీ సాధ్యం కాని గణాంకం ఇది. ఎందుకంటే.. ఇతడి తర్వాత రెండో అత్యధిక స్ట్రయిక్ రేట్ 150లోపే. అది కూడా కెప్టెన్ హార్దిక్, ఆల్ రౌండర్ దీపక్ హుడాలది.ద్రవిడ్ షాకింగ్ ప్రశ్న శ్రీలంకతో మూడో టి20 తర్వాత మైదానంలో టీమిండియా హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడాడు. ఈ సందర్భంగా సూర్యకుమార్ ను అతడు పలు ప్రశ్నలు అడిగాడు.

ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైనది ఏమంటే.. ''నువ్వు కుర్రాడిగా ఉన్నప్పుడు నా ఆట (బ్యాటింగ్)ను చూడలేదు కదా..?'' అని. ఇది చాలా కీలకమైన, ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాల్లో సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానం రాహుల్ ద్రవిడ్ దే. కానీ, కెరీర్ పూర్తయ్యాక చెప్పిన మాట ఇది. రాహుల్ ద్రవిడ్ తన కెరీర్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. దుర్బేధ్యమైన డిఫెన్స్ కు పేరుగాంచి అతడు.. ఓ దశలో వన్డేల నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. దీనికి కారణం.. స్ట్రయిక్ రేట్.సెహ్వాగ్, యువరాజ్ రాకతో.. ద్రవిడ్ కు వన్డేల్లో చోటు కరువైంది. దీంతో జట్టులో స్థానం కోసం కీపింగ్ సైతం చేశాడు. అయితే, క్రమంగా తన బ్యాటింగ్ లో దూకుడు పెంచాడు.

తన టెక్నిక్ కు ధాటిని జోడించాడు. బంతులు మింగకుండా పరుగులు చేయడం ప్రారంభించాడు. అతి తక్కువ బంతుల్లో వన్డే అర్ధ సెంచరీని అందుకున్న భారత క్రికెటర్ గా రికార్డునూ నెలకొల్పాడు. అందుకనే ఆ ప్రశ్న.. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. టీమిండియాలో అత్యంత దూకుడైన బ్యాట్స్ మన్ సూర్య కుమార్ యాదవ్. బౌలర్ బంతిని ఎక్కడ వేసిన బౌండరీకి పంపే సత్తా అతడి సొంతం.

అతి తక్కువ బంతులు.. అతి ఎక్కువ పరుగులు.. ఇదీ సూర్య సిద్ధాంతం. అలాంటి సూర్యను మైదానంలో ద్రవిడ్ తన ఒకప్పటి జిడ్డు బ్యాటింగ్ పై వేసిన ప్రశ్న కొంత ఆసక్తికరమే. అయితే, మరెవరైనా అయితే ''నేను మీ బ్యాటింగ్ ను చూడలేదు'' అని చెప్పేవారేమో..? కానీ, సూర్య మాత్రం.. ''మీ బ్యాటింగ్ చూశాను'' అని సమాధానం ఇచ్చాడు. కాగా, కొంత నెమ్మది అయినా, ద్రవిడ్ బ్యాటింగ్ ను వంక పెట్టేవారు ఉండరు. టెస్టుల్లో ఎంతటి విలువైన ఆటగాడో వన్డేల్లో్ అంతటి గొప్ప బ్యాట్స్ మన్ గా ఎదిగాడు ద్రవిడ్. అందుకనే వన్డేల్లోనూ 10 వేల పరుగులు చేయగలిగాడు.