Begin typing your search above and press return to search.

సెటిల్మెంట్ అవసరం లేదు .. మాల్యాను దివాలాకోరుగా ప్రకటించండి!

By:  Tupaki Desk   |   9 July 2020 7:00 AM GMT
సెటిల్మెంట్ అవసరం లేదు .. మాల్యాను దివాలాకోరుగా ప్రకటించండి!
X
విజయ్ మాల్యా .. వేలాది కోట్ల రూపాయలు బ్యాంకుల వద్ద రుణాలుగా తీసుకోని, వాటిని తిరిగి కట్టకుండా బ్యాంకులన్ని మోసం చేసి గత కొన్ని రోజులుగా లండన్ లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా పై ఇండియన్ బ్యాంకులు తమ వైఖరి ఏమిటో మరోసారి స్పష్టం చేసాయి. వేలకోట్లు ఎగొట్టి , లండన్ లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాల్సిందేనని ఇంగ్లాండ్ హైకోర్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 13 బ్యాంకుల కన్సార్టియం వాదనలు వినిపించింది. దీనితో ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ బ్రిగ్స్ తీర్పును రిజర్వ్‌లో ఉంచారు.

విజయ్ మాల్యాపై మేము దివాలా ఆదేశాలు జారీ చేశామని సెటిల్మెంట్ కోసం మాల్యా ముందుకు వచ్చిన ప్రయోజనం లేదని ఇండియన్ బ్యాంకులు హైకోర్టు కు స్పష్టం చేసాయి. మాల్యా చెప్తున్నట్టు తాము సెక్యూర్డ్ క్రెడిటర్లు కాదని, రెండో సెటిల్మెంట్ ఆఫర్ కింద యునైటెడ్ బ్రీవరీస్ హోల్డింగ్స్ ఆస్తులను మాల్యా చూపారని, కానీ అవి అధికారిక లిక్విడేటర్ ఆధీనంలో ఉన్నాయని బ్యాంకులు వెల్లడించాయి. కాబట్టి మాల్యా ఆఫర్ ‌కు విలువ లేదని, మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాల్సిందేనని కోరారు.

రాజకీయ కారణాలతో ఇండియాలో తనకి సరైన న్యాయం జరగదనే మాల్యా వాదనలు సరికావని , వాటిని పక్కన పెట్టాలని బ్యాంకుల కన్సార్టియం కోరింది. మంగళవారం మాల్యా రుణాలు సెక్యూర్డా కాదా అనే అంశంపై న్యాయమూర్తి బ్రిగ్స్ వాదనలు విన్నారు. కాగా, తనను భారత్‌ కు అప్పగించకుండా మాల్యా వివిధ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ దారులన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. ఇంగ్లాండ్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునే హక్కును మే నెలలో తిరస్కరించారు. యునైటెడ్ కింగ్‌ డమ్ ప్రభుత్వ నిర్ణయం ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది. మాల్యా భారత్ బ్యాంకులకు రూ.10వేల కోట్ల వరకు ఎగొట్టి బ్రిటన్ ‌లో ఉంటున్నాడు. మాల్యా నుండి ఈ మొత్తం వసూలు చేసుకునేందుకు బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి 2018లో దివాలా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే , తనకు ఇచ్చిన రుణాల విషయంలో బ్యాంకులకు పూర్తి గ్యారెంటీ ఉందని , రుణ చెల్లింపుల పరిష్కారానికి తాను ఇచ్చిన ఆఫర్లను బ్యాంకింగ్ పట్టించుకోవడం లేదన్నారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న లండన్ కోర్టు జడ్జి జస్టిస్ బ్రిగ్స్ మాల్యాపై పిటిషన్‌ ను ఏప్రిల్ 10న కొట్టివేశారు. ఈ తీర్పుపై బ్యాంకింగ్ కన్సార్టియం తిరిగి అమెండెడ్ పిటిషన్ దాఖలు చేసింది. మాల్యా చెబుతున్న అంశాల్లో నిజాలు లేవని ఈ పిటిషన్ వివరించింది.