Begin typing your search above and press return to search.

గంటా ‘ఆస్తుల్ని’ వేలానికి పెట్టాశారంట

By:  Tupaki Desk   |   11 Nov 2020 3:50 PM GMT
గంటా ‘ఆస్తుల్ని’ వేలానికి పెట్టాశారంట
X
ఏపీ రాజకీయాలన్నా.. అందునా విశాఖ జిల్లాకు చెందిన పెద్ద నాయకుల్లో ఒకరిగా నిలవటమే కాదు.. అధికారంలో ఎవరున్నా మంత్రి పదవిని చేజిక్కించుకునే టాలెంట్ ఉన్న అతి కొద్దిమందిలో గంటా శ్రీనివాసరావు ఒకరుగా చెబుతారు. ఆయన ప్లానింగ్ జగన్ సర్కారులో మాత్రం వర్క్ వుట్ కాలేదంటారు. ఆ మధ్య వరకు వార్తల్లో ఉన్న ఆయన ఇటీవల కాలంలో పెద్దగా రావటం లేదు. రోటీన్ కు భిన్నంగా రాజకీయ వార్తల్లో కాకుండా ఆర్థిక వార్తల్లోకి రావటం గమనార్హం.

మాజీ మంత్రి గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తుల్ని వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. డేట్ కూడా ఫిక్స్ చేసేసింది. ఈ కంపెనీకి చెందిన తొమ్మిది రకాలైన ఆస్తుల్ని బ్యాంకువారు వేలం వేయనున్నారు. ఈ కంపెనీ పేరు మీద గంటా వారు తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?

కోటి కాదు రెండు కోట్లు కాదు.ఆ మాటకు వస్తే రూ.50 కోట్లు కూడా కాదు. ఏకంగా రూ.248 కోట్లు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి వడ్డీలు కూడా భారీగా పెరిగిపోవటం.. వాటిని తిరిగి చెల్లించే విషయంలో పెద్దగా పట్టింపులు లేనట్లుగా ఉండిపోవటంతో.. అధికారులు రంగంలోకి దిగారు. వాస్తవానికి ఈ మొండి బాకీని వసూలు చేసేందుకు 2016 అక్టోబరు లోనే డిమాండ్ నోటీసును ప్రత్యూష సంస్థకు పంపారు.

అయితే.. అదే ఏడాది డిసెంబరులోనూ.. తర్వాత 2017 ఫిబ్రవరిలోనూ ప్రత్యూష కంపెనీ కుదవబెట్టిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని కీలక ప్రాంతాల్లో ఉన్న భవనాలు.. రుషికొండ వద్ద ఉన్న స్థలాల్ని కూడా బ్యాంకు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలా స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని తాజాగా వేలం వేయటానికి డిసైడ్ అయ్యారు. ఈ నెల 25న మొత్తం తొమ్మిది రకాల ఆస్తుల్ని వేలం వేస్తారని చెబుతున్నారు. మరి.. బ్యాంకు వారికి రావాల్సిన మొత్తమైనా వస్తుందా? లేదా? అన్నది వేలం జరిగిన తర్వాత లెక్క తేలనుంది. మరీ.. అంశంపై గంటా వారు ఇప్పుడైనా నోరు విప్పుతారా?